అశ్వారావుపేట లో జోరుగా మరింత దందా

Sakshitha news

అశ్వారావుపేట లో జోరుగా మరింత దందా!!
“మద్యం” అనధికార విక్రయాలు*

లైసెన్స్‌ దుకాణాల నుంచే అక్రమంగా సరఫరా క్వాటర్
బాటిల్‌పై అదనంగా రూ 20 వసూల్. ఫుల్ బాటిల్ పై అదనంగా 80 రూ వసూల్

ఎక్సైజ్‌ దాడులు మాత్రం కనిపించవు

అశ్వారావుపేట సాక్షిత :
అశ్వారావుపేట ఏజన్సీ ఏరియా పరిధిలో నూతన ఎక్సైజ్ పాలసీ సంవత్సరం నుంచి ఎక్కడ పడితే అక్కడ “బెల్టు”మద్యం షాపులు దర్శనమిస్తున్నాయి. కొందరు అధికార “మద్యం” వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అనధికారికంగా అక్రమ మద్యం వ్యాపార దందా కొనసాగిస్తున్నారు. గ్రామ, పల్లె, మండల కేంద్రం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున “బెల్టు” షాపులు నిర్వహిస్తూ మందుబాబు ల జేబులను గుల్ల చేస్తున్నారు. అసలు షాపుల కన్నా గ్రామాల్లో వెలసిన “బెల్టు” దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు జోరుగా.. హుషారుగా మరింత ఎక్కువగా జరుగుతున్నాయి.

అశ్వారావుపేట లాంటి 1/70 యాక్ట్ ఉన్న మండలం లో అన్ని గ్రామపంచాయతీ ల్లో పలుచోట్ల, మద్యం వ్యాపారస్తులు పోటాపోటీగా ఆర్ధిక మద్దతు కూడా ఇచ్చి బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు.దీంతో పలు ప్రధాన గ్రామాల్లో ఎక్కడికక్కడే ‘బెల్ట్‌ “షాపులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. సిండికేట్‌లు ఒక్కో బాటిల్‌పై రూ. 20 నుంచి 40 .రూ అదనంగా ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకుంటున్నా రు.అదే గ్రామాల్లో అయితే ఒక బాటిల్‌పై అదనంగా 40. రూ నుంచి 50. రూ పెంచి అమ్మకాలు చేపడుతున్నారు.

కొన్నిసార్లు డిమాండ్‌ ను బట్టి రూ.50 అదనంగా వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు అడ్డదారిలో సంపాదన కోసం వ్యాపారు లు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ఈ మేరకు బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. అశ్వారావుపేట లో ఒక దుకాణం నుంచి కేవలం “బెల్ట్‌” షాపులకే మద్యం సరఫరా అవుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వ్యాపారులు సైతం అసలు షాపుల కన్నా గ్రామాల్లో ఉన్న అనధికార “బెల్ట్‌” షాప్‌ల ద్వారా ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేలా చూస్తున్నారు. కిరాణా షాపులు, బడ్డీల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతుంది. బెల్ట్‌ నిర్వాహకులు లైసెన్స్‌ దుకాణాల్లో మద్యం సీసాలను కొనుగోలు చేసి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని వచ్చి విక్రయాలు చేపడుతున్నారు.

కొన్ని గ్రామాల్లో మూడు నుంచి ఏడు వరకు మద్యం “బెల్ట్‌” దుకాణాలు ఉన్నాయి.అంటే పరిస్థితి ఏ మేరకు ఉందొ అర్ధం అవుతుంది. “బెల్ట్‌” దుకాణాలను నివారించాల్సిన బాధ్యత అశ్వారావుపేట ఎక్సైజ్‌శాఖ అధికారులపై ఉంది. కానీ,వారు ఎప్పుడు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. నెలకోసారి ముందస్తుగా సమాచారం ఇచ్చి ఆపై తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారని అన్ని గ్రామాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టు షాపులపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రతి బాటిల్ పై పైసా వసూల్..
వైన్ షాపుల నిర్వాహకులు , ప్రింటెడ్ ధర కంటే క్వార్టర్‌కు రూ. 20 ఫుల్ బాటిల్‌కు రూ. 80 చొప్పున అధిక ధరలకు విక్రయి స్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడు తున్నారు. మరికొన్ని గ్రామాల్లో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యాన్ని అధిక ధరలకు అమ్మి అక్రమంగా డబ్బు లు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Scroll to Top