SAKSHITHA NEWS

ఎన్టీటిపిఎస్ కాలుష్య నివారణకు ఐక్యంగా కృషిచేద్దాం.

సాధ్యమైనంత వరకు బూడిద కాలుష్యాన్ని నివారించాం.

ఏన్టీటీపీఎస్ సి.ఎస్.ఆర్ నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం.

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .

ఎన్టీటీపీఎస్ ఆధ్వర్యంలో జూపూడిలో మెడికల్ క్యాంపు ప్రారంభం.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం,

ఎన్టీటీపిఎస్ కాలుష్య నివారణకు ఐకమత్యంగా కృషి చేద్దామని, ఇప్పటికే సాధ్యమైనంత వరకు బూడిద కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి గ్రామంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టిటీపీఎస్ యాజమాన్యం శాసనసభ్యులు కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని, వైద్యులను వివిధ పరీక్షల గురించి వాకబు చేశారు. గ్రామ పెద్దలను, స్థానికులను పలకరించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ విద్యుత్తు నిత్యవసర వస్తువుగా మారిన నేటి తరుణంలో నిరంతర విద్యుత్ ఉత్పాదన ఆవశ్యమన్నారు. విద్యుత్తు ఉత్పాదనకు థర్మల్ పవర్ స్టేషన్లో నిర్వహణ ఎంతో కీలకమన్నారు. ఈ క్రమంలో సాధారణంగానే బూడిద వెలువడుతుందన్నారు. బూడిదను ఇక్కడి నుంచి తరలించడం తప్పదన్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ బూడిద కాలుష్యం వెలువకుండా తరలిస్తున్నట్లు వెల్లడించారు. కాలుష్య నివారణకు విస్తృతంగా చెట్లు నాటడం కూడా ముఖ్యమన్నారు. ఇప్పటికే అనధికారిక ఉన్న బూడిద నిల్వలను తొలగించినట్లు పేర్కొన్నారు.

అలాగే ఎన్టీటీపీఎస్ నుంచి కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద 4 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారన్నారు. వీటిని అత్యంత కాలుష్య ప్రభావిత ప్రాంతమైన ఖాజీమాన్యంలో అభివృద్ధి పనులకు రూ.3కోట్లు, మరో రెండు స్మశాన వాటికల అభివృద్ధికి రూ.1 కోటి కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇంకా ఎన్టీటీపీఎస్ నుంచి రావలసిన సి.ఎస్.ఆర్ నిధులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాలుష్య ప్రభావిత గ్రామాల్లో ప్రతి నెలకు ఒకసారి ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎన్టీటీపీఎస్ యాజమాన్యానికి సూచించారు.

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద సబ్సిడీపై అందిస్తున్న సోలార్ విద్యుత్తును అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS