
తిరుపతి నగర అభివృద్ధికి కలసికట్టుగా పనిచేద్దాం.
అభివృద్ధి నిధులు మంజూరు చేయిస్తా – ఎమ్మెల్యే ఆరణి.
తిరుపతి నగర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం అధికప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్మార్ట్ సిటీ పనుల పూర్తికి రాష్ట్ర వాటా కింద రావాల్సిన నిధులను వీలైనంత త్వరగా ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. స్మార్ట్ సిటీ, తుడా లో అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్.మౌర్య అధ్యక్షతన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు.19 స్మార్ట్ సిటీ పనులు పెండింగ్ లో ఉండగా వీటి పూర్తి చేయడానికి నిధులు అవసరమని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
తక్షణం 25 కోట్లు మంజూరు చేస్తే స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు ఆయనకు తెలిపారు. గత ప్రభుత్వం స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కేంద్రం వాటాకు సమానంగా రాష్ట్ర వాటా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం పెండింగ్ లో ఉన్న రాష్ట్ర వాటాను చెల్లించడంతో మున్సిపల్ శాఖకు కేంద్రం నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధులపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్ళినట్లు ఆయన తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆయన చెప్పారు. శెట్టిపల్లి భూ సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల చొరవతో అతి త్వరలో పూర్తిగా పరిష్కారమౌతుందని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో శెట్టిపల్లిని మున్సిపల్ కార్పోరేషన్ లో కలిపిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శెట్టిపల్లి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తుడా పరిధిలోకి తిరిగి తీసుకొస్తోందని ఆయన చెప్పారు. తిరుపతి అభివృద్ధి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని నెలలో ఒక రోజు నగర అభివృద్ధిపై సమీక్షించి సమన్వయ లోపం లేకుండా చూస్తే బాగుంటుందని ఆయన అధికారులు సూచించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ తో పార్కులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాయలచెరువు రోడ్డు రైతు బజార్ ను ఆనుకుని నిర్మిస్తున్న తుడా టవర్స్ ను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, తుడ సెక్రటరీ వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కృష్ణారెడ్డి, శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ జి.ఎం.చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, తిరుపతి నగరపాలక సంస్థ, తుడా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
