కార్మిక సంక్షేమం–నైపుణ్యాభివృద్ధితో సమగ్ర ప్రగతి సాధ్యం…

Sakshitha news

కార్మిక సంక్షేమం–నైపుణ్యాభివృద్ధితో సమగ్ర ప్రగతి సాధ్యం…

అంతర్జాతీయ కార్మిక వేదికలో మంత్రి డా.జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు…

సాక్షిత న్యూస్ పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: హైదరాబాద్, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కార్మిక సంఘాల సదస్సు రెండో రోజు సమావేశాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. పలు దేశాల కార్మిక సంఘాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, నిపుణులు సమావేశానికి హాజరై కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు.

మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ హైదరాబాద్ వైవిధ్యానికి, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. స్థిరమైన అభివృద్ధి, నవకల్పన, సవాళ్లను అధిగమించే సామర్థ్యంతో దేశాలు కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
దేశ ప్రగతికి కార్మికులే అసలైన శక్తి అని పేర్కొన్న ఆయన, వారికి గౌరవప్రదమైన జీవనం, మెరుగైన వేతనాలు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికుల నైపుణ్యాలను పెంపొందించడం అత్యంత అవసరమని చెప్పారు.

అసంఘటిత రంగ కార్మికుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి సామాజిక భద్రతను బలోపేతం చేస్తోందని తెలిపారు. విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు మహిళలకు కూడా పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. దేశాల మధ్య కార్మికుల నైపుణ్యాలకు పరస్పర గుర్తింపు లభించేలా సహకారం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో కార్మికుల పాత్ర మరింత కీలకంగా మారుతోందని అన్నారు. దేశాల మధ్య అనుభవాలు, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం పంచుకోవడం ద్వారా యువతకు మరింత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, అసంఘటిత రంగ కార్మికుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధితో పాటు కార్మికుల హక్కులు, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ అంతర్జాతీయ కార్మిక వేదిక దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికులకు గౌరవప్రదమైన జీవనం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక మైలురాయిగా నిలుస్తుందని గడ్డం వంశీకృష్ణ అభిప్రాయపడ్డారు.

Scroll to Top