దళిత యువకునికి కేవీపీఎస్ నేతల పరామర్శ
** కిడ్నాప్ చేసిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టి శిక్షించాలి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రుయాలో చికిత్స పొందుతున్న దళిత యువకుడు పవన్ కుమార్ ను కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటేశు, జిల్లా అధ్యక్షులు ఎన్.శ్రీనివాసులు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు రుయా వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కూడా పవన్ ను పరామర్శించారని, వెంటనే ఈ దాడిలో ఎవరు పాల్గొన్నారు…,ఎవరు కిడ్నాప్ చేశారు…,ఎవరు భౌతికంగా దాడి చేశారు…,ఎవరు ఎంత తీవ్రమైన గాయాలు చేశారో…, ఎవరు తిరుపతి నుంచి చిత్తూరుకు తీసుకువెళ్లారనే విషయాలను పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.
అంత క్రూరంగా దాడి చేసిన ఘటన వెనకాల ఎవరు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షలు వేయాలని కెవిపిఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు. పవన్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, ఆధ్యాత్మిక, ప్రశాంత తిరుపతిలో ఇలాంటి వాతావరణం మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు, ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నచోట ఇలాంటి దాడులు ఈ కాలంలో తరచూ జరుగుతూనే ఉన్నాయని, మొన్న జేమ్స్ ను ఇదే తరహాలో దాడి చేయడం, ప్రొఫెసర్ చెంగయ్య పై దాడి చేయడం, ఇలా తరచూ ఏదో విధంగా దళితులపై బడుగు బలహీన వర్గాల అమాయక ప్రజల పైన, యువత పైన తీవ్రమైన దాడులు ఈ కాలంలో పెరిగిపోతున్నాయని తెలిపారు. వీటిపై నిఘా పెట్టి నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు.
పవన్ కుమార్ కి వారి కుటుంబానికి రక్షణ కల్పించాలి, పవన్ కోలుకునేంతవరకు ప్రభుత్వం సహాయ సహకారాలు కుటుంబానికి అందించాలి. మెరుగైన వైద్యం అందించాలనీ కెవిపిఎస్ డిమాండ్ చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జి.బాలసుబ్రమణ్యం, కే.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
