SAKSHITHA NEWS

హైదరాబాద్‌: అమెరికాలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన బిజీబిజీగా సాగుతున్నది. అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆయనతో సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్‌ వివరిస్తున్నారు. ఈ నెల 16న కేటీఆర్‌ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ (ఏఎస్‌సీఈ) ఆధ్వర్యంలో నెవడా రాష్ట్రంలోని హెండర్సన్‌ నగరంలో ఈ నెల 21నుంచి 25 వరకు జరగనున్న వరల్డ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌లో కేటీఆర్‌ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. నీటి వనరుల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారిందో వివరించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్‌ భగీరథ తదితర పథకాలతో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలపై ఆయన ప్రసంగించనున్నారు. గడిచిన ఐదు రోజులుగా న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్‌ తదితర నగరాల్లో పర్యటించారు. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు తమ పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్‌కేర్‌ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్స్‌ కూడా రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి సంబంధించి మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ)ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. బయోటెక్నాలజీ కంపెనీ ఆక్యూజెన్‌ హైదరాబాద్‌లో రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌అండ్‌డీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని ప్రగతిశీల విధానాలపై కంపెనీల ఆసక్తి
కేటీఆర్‌ గత గురువారం న్యూయార్క్‌లో ఇన్వెస్టర్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రసంగించడంతోపాటు పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం, యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల వ్యాపారాలు స్థాపించేందుకు తగిన వనరులు కలిగి ఉన్నదని, దేశంలోనే ఒక ఆదర్శ పెట్టుబడి గమ్యస్థానంగా ఎదిగిందని తెలిపారు. ప్రగతిశీల, పరిశ్రమ-స్నేహపూర్వక విధానాలు, బలమైన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ తెలంగాణ సొంతమని చెప్పారు. తెలంగాణ 14 ప్రాధాన్యతా రంగాలను గుర్తించిందని వెల్లడించారు.

పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల క్యూ
మాండీ హోల్డింగ్స్‌ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ముందుకు రాగా, రాష్ట్రంలో ఇప్పటికే గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కలిగి ఉన్న స్టోరబుల్‌ కంపెనీ మరిన్ని విస్తరణ ప్రణాళికల ప్రకటించింది. రైట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ త్వరలోనే వరంగల్‌ నగరంలో ఒక డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాషింగ్టన్‌ డీసీలో 30కిపైగా ఐటీ కంపెనీల యాజమాన్యాలతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2,500 ఐటీ ఉద్యోగాలు ద్వితీయ శ్రేణి నగరాల్లో కల్పించే విధంగా పలు కంపెనీలు కార్యాలయాల ఏర్పాటునకు ముందుకొచ్చాయి. జాప్‌కామ్‌ గ్రూప్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటునకు ముందుకొచ్చింది. జెనెసిస్‌ 50-60 మిలియన్‌ డాలర్లతో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.


SAKSHITHA NEWS