ప్రధాన కార్యదర్శితో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కీలక చర్చలు….
పవర్ ప్లాంట్, ఈఎస్ఐ ఆస్పత్రి, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై వినతి…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరుతూ రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాన కార్యదర్శితో ఎమ్మెల్యే చర్చించారు.
నియోజకవర్గంలో ప్రతిపాదిత 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం, ఉద్యోగుల రాష్ట్ర బీమా ఆస్పత్రి ఏర్పాటు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది.


