తల్లి పాలతోనే శిశువుకు ఆరోగ్యకరమైన భవిష్యత్…
వారోత్సవాల్లో మేయర్ మహంకాళి స్వామి పిలుపు….
సాక్షిత పెద్దపల్లి// గోదావరిఖని,
శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లి పాలే తొలి అడుగని, పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలల పాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వడం అత్యంత అవసరమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ స్వాగత్ ఫంక్షన్ హాల్‌లో సీడీపీఓ అలేఖ్య ఆధ్వర్యంలో 4, 5, 6, 7 డివిజన్ల అంగన్‌వాడీ కేంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, తల్లి పాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని పేర్కొన్నారు.
గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్‌వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లి పాల ప్రాధాన్యంపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
4వ. డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు మాట్లాడుతూ, తల్లి పాల వారోత్సవాల నిర్వహణతో తల్లుల్లో అవగాహన పెంపొందుతుందని, అక్షరాభ్యాసం, అన్నప్రాశన, శ్రీమంతం వంటి సంప్రదాయ కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం తల్లి పాల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు.
కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేగొళపు రమాదేవి, 5వ డివిజన్ కార్పొరేటర్ సత్యప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, పర్యవేక్షకురాలు జామున, ఇన్‌చార్జి అనిల్, అంగన్‌వాడీ కార్యకర్తలు బి. మంజుల, బి. శ్రీవాణి, ఎస్. రజిత, కే. అరుణ, బి. రాజలక్ష్మి, బి. సరోజ, కే. నర్మద, కే. స్వరూప, ఆశ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.


