మూడు నెలల శిక్షణతో పాటు ఉద్యోగ సహాయం…
– జూలై 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన…
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో మూడు నెలలపాటు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, పీజీ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ ఎక్సెల్, అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, పవర్ బీఐ, పైథాన్, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలపై అనుభవజ్ఞులైన శిక్షకుల ద్వారా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రంతో పాటు ఉద్యోగాల కోసం ప్రత్యేక సహాయం కూడా అందిస్తామని వెల్లడించారు.
శిక్షణ పూర్తిగా ఉచితమని, అయితే నమోదు ప్రక్రియ కోసం ఒక్కసారి మాత్రమే రూ.600 చెల్లించాల్సి ఉంటుందని, దీనికి అదనంగా ఎలాంటి రుసుములు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి కేవలం 100 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థుల హాజరు తప్పనిసరి అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 15లోపు పెద్దపల్లిలోని తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 9059506807 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
