ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి…
జిల్లా కలెక్టర్లకు డాక్టర్ పవన్ కుమార్ శర్మ ఆదేశాలు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా జూలై 24 నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి డాక్టర్ పవన్ కుమార్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పాల్గొనగా, పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 22 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే గడువులో సగం సమయం ముగిసినందున మిగిలిన రోజుల్లో ప్రతి రోజు కనీసం 8 శాతం చొప్పున డిజిటలైజేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంకా పంపిణీ చేయాల్సిన ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే అందజేసి, పంపిణీ చేసిన ప్రతి ఫారాన్ని తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఒక్క ఫారాన్ని కూడా డిజిటలైజ్ చేయని బూత్ స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి వారి పనితీరును మెరుగుపరచాలని సూచించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ఇతర కార్యక్రమాల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి రోజు యాదృచ్ఛికంగా ఐదుగురు బూత్ స్థాయి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అవసరమైన చోట ఇతర అధికారులు, పర్యవేక్షకులు, స్వచ్ఛంద సేవకుల సహకారం తీసుకుని లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు.
ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 99.6 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, ప్రస్తుతం 21.94 శాతం డిజిటలైజేషన్ పూర్తైందని తెలిపారు. తదుపరి సమీక్ష నాటికి ప్రతి జిల్లాలో కనీసం 50 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.
వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వెనుకబడిన బూత్ స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాలని, అవసరమైన చోట అదనపు సిబ్బంది సహకారం అందించి లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ విభాగాధికారులు గంగయ్య, సురేష్, ఎన్నికల విభాగ అధికారి ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

