నాలుగు రోజులుగా నీటి కష్టాలు… కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినుల అవస్థలు…
పనిచేయని బోర్లు – అపరిశుభ్ర మరుగుదొడ్లు, హాస్టల్లో పురుగులతో తీవ్ర ఇబ్బందులు…
అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పొట్నూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో మౌలిక వసతుల, సమస్యలు విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యాలయంలో గత నాలుగు రోజులుగా బోర్లు పనిచేయకపోవడంతో తాగునీరు, స్నానానికి నీరు అందక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. తమ పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు విద్యార్థినులు నీటి సమస్య గురించి వివరించి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా హాస్టల్ గదుల్లో పురుగులు అధికంగా వస్తున్నాయని, బాత్రూమ్లు, మరుగుదొడ్లు సక్రమంగా శుభ్రం చేయడం లేదని విద్యార్థినులు వాపోయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా విద్యార్థినుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కస్తూర్బా విద్యాలయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడం విచారకరమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. వెంటనే పనిచేయని బోర్లను మరమ్మతు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పురుగుమందులు పిచికారీ చేసి విద్యార్థినులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే విద్యాలయాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
