మద్యం స్కామ్ దృష్టి మళ్ళింపునకే జగన్ డ్రామా

Sakshitha news

మద్యం స్కామ్ దృష్టి మళ్ళింపునకే జగన్ డ్రామా

** తాడేపల్లి ప్యాలెస్ లోనే కల్తీ మద్యం ఫార్ములా

** చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సీఆర్ రాజన్

సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: గత ఐదేళ్లు లిక్కర్ మాఫియా నడిపి రూ.3500కోట్లు దోచుకున్న స్కామ్ విషయం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్ జగన్ రెడ్డి అండ్ కో నాయకులు డ్రామాలు ఆడుతున్నారని చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సీఆర్ రాజన్ ఆరోపించారు. గురువారం చిత్తూరులోని
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యాలయ కార్యదర్శి. యన్.మోహన్ రాజ్, జిల్లా పార్టీ కార్యదర్శి జయచంద్ర బాబు నాయుడు, వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి, పూతలపట్టు నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, పార్టీ నాయకులు యువరాజులు నాయుడు, శేషాద్రి నాయుడులతో కలసి మీడియాతో మాట్లాడారు.
తమ అవినీతి, అక్రమాలను, పాపాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ అండ్ కో పి.హెచ్.డి చేశారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం ఏరులై పారించి… ఇప్పుడు నకిలీ మద్యం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే కుట్ర పూరితంగా కల్తీ మద్యం ఫార్ములా ను తాడేపల్లి ప్యాలెస్ లో తయారు చేశారని మండిపడ్డారు.
అందులో భాగంగా సెప్టెంబర్ 24న ఆఫ్రికాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్థనరావును 23వ తేదీన జోగి రమేష్ ఇంటికి పిలిపించుకున్నారని తెలిపారు. జనార్ధనరావు, జోగి రమేష్ చిన్ననాటి స్నేహితులు కావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు రచించారు.
గత ఐదేళ్లు సరఫరా చేసిన జే బ్రాండ్లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు, అమెరికా ల్యాబ్ లు స్పష్టం చేశాయి.
ముడుపుల సొమ్ముతో మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ వంటి దేశాల్లో వ్యాపారాలు, భూములు కొనుగోలు చేసినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో వైసీపీ నేతల బండారం బయటపడిందని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో డీకార్డ్ లాజిస్టిక్స్ ఖాతా నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి (ఎండీగా పెద్ది రెడ్డి స్వర్ణలత-మిథున్ రెడ్డి తల్లి) రూ.5కోట్లు జమైనట్లు సిట్ తెల్చింది. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి 2013లో ఆఫ్రికాలోని కామెరూన్ లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో కల్తీ మద్యం వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా..? కల్తీ మద్యం జరిగిందని అక్కడ స్వయంగా అక్కడ మంత్రి ఆ కంపెనీని సీజ్ చేసిన మాట వాస్తవం కాదా..? సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి జగన్ రెడ్డి బినామీలు కాదా..? అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలపై ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు… కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల సమయంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన దాసరి పల్లి జయచంద్ర రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి, తగిన విచారణ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. జయచంద్రా రెడ్డి పై పోలీసు కేసు నమోదు చేయడం కూడా జరిగింది.. ఇది టీడీపీ ప్రభుత్వ, పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. ఎవరో ఎక్కడో తప్పు చేస్తే దాన్ని ప్రభుత్వానికి, పార్టీకి అంటగట్టేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవాలను వక్రీకరించి మద్యం కుంభకోణంలో జగన్ తమ కొండంత దోపిడీని కప్పిపెట్టు కొనే కుట్ర నాటకం ఆడుతున్నారని విమర్శించారు.