ఉజ్వల యోజన కింద గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యపు వైఖరి

Sakshitha news

ఉజ్వల యోజన కింద గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యపు వైఖరి

…..

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, ప్రాత్యక్షంలో మాత్రం కొందరు గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం వినియోగదారులను ఇబ్బంది పెట్టడం సర్వసాధారణంగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి గ్యాస్ సిలిండర్‌లు పొందడానికి వెళ్లినప్పుడు ఏజెన్సీ సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో జిరాక్స్ పత్రాలు తేవాలని, మళ్లీ కొత్తగా పత్రాలు అడగడం వల్ల లబ్ధిదారులు తిరుగు ప్రయాణం చేయాల్సి వస్తోంది.

మా మాటలే చట్టం అన్నట్టుగా ఏజెన్సీల ప్రవర్తన

చాలా చోట్ల ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులతో కనీస మర్యాదా మాటలు కూడా మాట్లాడడం లేదని చెప్పుకుంటున్నారు. “ఇష్టం ఉంటే జిరాక్స్ ఇవ్వండి, లేకపోతే వేరేవాళ్లని కలవండి” అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని స్థానికులు వివరించారు. ఈ రకమైన ప్రవర్తన పథకం ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీలపై అధికారుల అప్రమత్తత అవసరం

ప్రజలకు సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన ఉజ్వల యోజన ఇప్పుడు నిరాశ కలిగించే విధంగా మారిందని వినియోగదారులు అంటున్నారు. ప్రభుత్వ పథకాలు సజావుగా సాగాలంటే, గ్యాస్ ఏజెన్సీలపై కఠిన పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు. సంబంధిత జిల్లా సివిల్ సరఫరా శాఖ అధికారులు ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

ప్రభుత్వానికి ప్రజల విజ్ఞప్తి

ఉజ్వల యోజన మాధ్యమంగా లబ్ధిదారులను సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని తెలిసినా, కింది స్థాయి సిబ్బందిలో అలసత్వ ధోరణి ప్రజలను దూరం చేస్తోంది. ఈ దశలో ప్రభుత్వం తక్షణం దృష్టి సారించి సేవా ధోరణి బలోపేతం చేయడం, ఫిర్యాదు వ్యవస్థను చురుకుగా చేయడం అవసరమని స్త్రీ సంఘాలు సూచిస్తున్నాయి.