బాలాజీ రిజర్వాయర్”పై సీఎంకు లేఖ రాస్తా
** వందేళ్లు పైబడిన పురాతన భవనాలను తొలగించాలి
**బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలో కురిసే వర్షాలకు కపిలతీర్థం, మాల్వాడి గుండంలలోని వర్షపు నీరు వృధా కాకుండా గతంలో “బాలాజీ రిజర్వాయర్” నిర్మాణ ప్రతిపాదనలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తానని బీజేపీ సీనియర్ నేత పి.నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. వాయుగుండం కారణంగా గత 3రోజుల నుంచి తిరుపతి, తిరుమలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. స్థానిక వీవీ మహల్ రోడ్డులోని తన కార్యాలయం లో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బాలాజీ రిజర్వాయర్ ద్వారా తిరుపతి, తిరుమలకు పూర్తి నీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. అలాగే సమీప శైవక్షేత్రం శ్రీకాళహస్తికి కూడా పుష్కలంగా నీరు సరఫరా చేయొచ్చన్నారు. ఈ దిశగా గతంలో చేసిన రిజర్వాయర్ ప్రతిపాదనలకు ఆచరణ రూపం చూపాలన్న డిమాండ్ తో ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే
“చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా” కాకుండా తిరుపతిలో శిథిలావస్థకు చేరుకునేలా 100 సం”లు పైబడిన పురాతన భవనాలను ఐఐటీ నిపుణుల ద్వారా గుర్తించి సంబంధిత శాఖల ద్వారా ప్రాణనష్టం జరగకముందే తొలగించాలని కలెక్టర్ కు నవీన్ విజ్ఞప్తి చేశారు.
తిరుపతిలోని (పూలమఠం) హతిరాంజీ మఠంలో శిథిలావస్థకు చేరుకున్న గదులను, గోడలను, స్లాబులను తొలగించి ప్రాణనష్టం జరగకముందే పటిష్టమైన చర్యలు తీసుకొని అక్కడున్న వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ, జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు నగర ప్రజలను, యాత్రికులను అప్రమత్తం చేస్తూ ప్రమాదాలు జరగకుండా అనేక సూచనలు మీడియా.. సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారని…. అందుకు తగ్గట్టుగా ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరమంతా జలమయమైందని… కపిలతీర్థం మాల్వాడి గుండం ఉదృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అలాగే నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాలలో
“ప్రమాదపు హెచ్చరిక సూచిక బోర్డులను” వెంటనే ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు కూడా వృక్షాల వద్ద నిలబడకుండా, రోడ్లపై ఉన్న మ్యాన్ హోల్స్, ఓపెన్ డ్రైన్ (కాలువలు) ల దగ్గర గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నవీన్ విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
