అనుమతి లేకుండా సీతారామ టెండర్లా?..
ప్రజాపాలన అంటే ఇదేనా..- కేటీఆర్
ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తం
సుద్దపూస ముచ్చట్లు చెప్పి ఇప్పుడు నిబంధనలు తుంగలో తొక్కుతరా?
మత్స్యకారుల జీవితాల్లో సర్కార్ మట్టి
మూసీ మురుగులో కోట్లు కుమ్మరిస్తారు..
జలాశయాల్లో చేపపిల్లలు వదలరా?
మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం
అనుమతులు లేకుండానే సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.1074 కోట్ల పనులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తం’ అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. ‘అంచనాలు పెంచారని హాహాకారాలు చేసినోళ్లు.. అవినీతి జరిగిందని బురదజల్లినోళ్లు.. కాళేశ్వరం మీద కక్షగట్టి రైతుల పొట్టగొట్టినోళ్లు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపినోళ్లు.. తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కకి రాష్ర్టాన్ని ఆగంపట్టించినోళ్లు, ప్రజాపాలన అంటూ పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికేటోళ్లు.. సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎట్ల పిలిచిండ్రు?’ అంటూ నిలదీశారు. ‘సుద్దపూస ముచ్చట్లు చెప్పేటోళ్లు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలను ఎలా తుంగలో తొకారు’ అని ప్రశ్నించారు. ఒక మీటింగ్‌లో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశాలివ్వడం.. మరో మీటింగ్‌లో ఇదేంటంటూ నంగనాచి మాటలు చెప్పడమేమిటని విమర్శించారు. ‘ప్రాజెక్టు పూర్తయ్యి కోటి ఏకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్లు వేసి విచారణ చేయిస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలి?’ అంటూ నిప్పులు చెరిగారు. సీతారామ టెండర్లకు సంబంధించి పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
నడుమంత్రపు పాలనలో నీలివిప్లవం నెర్రెలు
మత్స్యకారుల జీవితాల్లో రేవంత్‌రెడ్డి సర్కారు మట్టికొట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నడుమంత్రపు పాలనలో నీలి విప్లవం నెర్రెలుబారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో చేపల కథ ముగిసిన అధ్యాయమేనా? అని ప్రశ్నించారు. మత్స్య సంపదపై ఇందిరమ్మ రాజ్యం కక్షగట్టిందని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో ఏటా 20 వేల టన్నుల దిగుబడి వచ్చిన మత్స్యపంట కాంగ్రెస్ సర్కారు కండ్లమంటకు నీటిమూట అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయి. కానీ, కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాల్లేకుండా పోయాయి’ అని ఎద్దేవాచేశారు. మూసీ మురికిలో కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ జలాశయాల్లో చేపపిల్లలు వదలడంలో లేకుండా పోయిందని దెప్పిపొడియారు. మూసీ పేరుతో పేదల ఇండ్లనే కూల్చి రాక్షసానందం పొందుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి, ఉపాధి లేక బోసిపోయిన బెస్త వాడలపై ప్రేమ ఎందుకు ఉటుందని దుయ్యబట్టారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ ఖ్యాతిని మంటగలుపుతున్న రేవంత్‌రెడ్డికి ముదిరాజ్ సోదరుల దీనస్థితిపై దయ లేకపాయెనని విమర్శించారు.