SAKSHITHA NEWS

ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌పై వేటు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. సాధారణ పరిపాలనశాఖ రాజకీయ కార్యదర్శి ఎన్‌.సురేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీజేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సునీల్‌కుమార్‌పై అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ప్రకారం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు జీవో 1695 విడుదల చేసింది. తన వివరణను లిఖిత పూర్వకంగా గానీ లేదా వ్యక్తిగతంగా గాని 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొంది. రాజకీయ ఒత్తిడి తెస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వెల్లడిరచింది.

సోషల్‌ మీడియా ద్వారా సునీల్‌కుమార్‌ చేసిన ఆరోపణలపై గుంటూరుజిల్లా నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జులై 12న ప్రభుత్వంపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినట్లు రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై చేసిన అభియోగాలపై 15రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపైన, అప్పటి సీఎం జగన్‌పైన వ్యక్తిగత దూషణలు చేశారు. దానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రఘురామకృష్ణరాజును ఏపీకి తరలించి దర్యాప్తు చేశారు. ఆ సమయంలో తనను విచారణ పేరుతో సునీల్‌కుమార్‌ వేధింపులకు పాల్పడ్డారని రఘురామ అభియోగాలు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారన్న ఆరోపణలపై చాలా మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఇప్పటికే సునీల్‌ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసి…వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంచిన విషయం విదితమే.


SAKSHITHA NEWS