నిబంధనల ఉల్లంఘనపై సాక్షాత్తూ ఎన్నికల సంఘం దర్యాప్తునకు ఆదేశించినా కలెక్టర్, స్థానిక అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేదని మాజీమంత్రి ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అధికారుల ఉల్లంఘనలపై రెండ్రోజుల్లో విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించినా ఎందుకు ఖాతరు చేయడం లేదని ప్రత్తిపాటి ప్రశ్నించారు.
వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట వైకాపా సమన్వయకర్త రాజేష్‌నాయుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్త పిల్లి కోటేశ్వరరావు ఈసీకి ఫిర్యాదు చేశారు. అధికారికంగా ఎలాంటి హోదా లేని సమన్వయకర్తను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించి వేదిక పంచుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన లిఖితపూర్వకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. పిల్లి కోటేశ్వరరావు ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల సంఘం విచారణ జరిపి నివేదిక పంపాలని కలెక్టర్‌కు లేఖ పంపించింది. ఇప్పటికీ ఇంత జరుగుతున్నా అధికారులు విచారణ జరపకుండా నివేదిక సమర్పించలేదని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని మరోసారి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని ప్రత్తిపాటి తెలిపారు.