ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తప్పనిసరి
సోక్‌పిట్ లేకుంటే కొత్త ఇళ్లకు ఇంటి నంబర్, నల్లా కనెక్షన్ మంజూరు కాదు….
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి, : జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన పట్టణ పరిపాలన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జల శక్తి జన భాగిదారి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఇంకుడు గుంత (సోక్‌పిట్) ఏర్పాటు చేయాలని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఇకపై కొత్తగా నిర్మించే ప్రతి ఇంటికి సోక్‌పిట్ తప్పనిసరిగా ఉండాలని, ఇంకుడు గుంత లేని ఇళ్లకు ఇంటి నంబర్‌తో పాటు తాగునీటి నల్లా కనెక్షన్ కూడా మంజూరు చేయబోమని స్పష్టం చేశారు.
ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి వార్డు పరిధిలో వచ్చే నెల రోజుల్లో కనీసం 30 ఇంకుడు గుంతలు నిర్మించేలా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సోక్‌పిట్‌ల ఏర్పాటు తప్పనిసరి చేస్తూ, వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే కాలానుగుణ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడంతో పాటు పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షిస్తూ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని, ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


