మహిళల గౌరవానికి బాల్యంనుంచే విలువల బోధన
** జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్ జి.అర్చన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నేటి పరిస్థితుల్లో మహిళల పట్ల గౌరవభావం పెంపొందాలంటే బాల్యం నుంచే సరైన విలువలను బోధించాల్సిన అవసరం ఉందని అదనపు జిల్లా జడ్జి జస్టిస్ జి.అర్చన సూచించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన జస్టిస్ అర్చన మాట్లాడుతూ, విద్యా జ్యోతి వెలిగించిన మహనీయుడు జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ మానవ సమాజాన్ని సంస్కరణల వైపు నడిపించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పారు. అలాగే సమాజ పురోగతికి సామాజిక సంస్కరణలు అవసరమని గ్రహించిన జ్యోతిబా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్య, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, స్వయం నియంత్రణ వంటి విలువలను పెంపొందించే దిశగా కృషి చేశారని తెలిపారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి విద్యనే ప్రధాన మార్గంగా భావించి, తన సతీమణి నుంచే విద్యా ప్రబోధాన్ని ప్రారంభించారని వివరించారు.
ప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధి ఉంటే వైరుధ్యాలు తగ్గుతాయని ఆయన చైతన్యం కల్పించారన్నారు. “గులాం గిరి” వంటి రచనల ద్వారా సామాజిక స్వేచ్ఛకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. మహిళల్లో విద్యా చైతన్యం పెంపొందించడంలో ఆయన కృషి విశేషమని గుర్తు చేశారు. ఏపీ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు కె.వి. కృష్ణయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వివక్షను తొలగించడానికి విద్యే ప్రధాన మార్గమని, ప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు మహతి కళాక్షేత్రంలో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. టీటీడీ ఉద్యోగులు జ్యోతిబా పూలే జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా 60 మంది ఉద్యోగులను మహాత్మా జ్యోతిబా పూలే అవార్డులతో సత్కరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా, క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఏ.ఆనందరాజు, మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కట్టమంచి ఇందిర, డా. ఎన్.భీమన్న, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి, పీఆర్వోలు రవి, నీలిమ, మహిళా ఉద్యోగులు, తదితర అధికారులు, ఉద్యోగ సంఘం నాయకులు గోల్కొండ వెంకటేశం, శివ, ఆంజనేయులు, కాటా గుణశేఖర్, జాటోత్ భాస్కర్, కల్పన, విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY