కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట
• పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు
• ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి
• త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు
• వెదురు పెంపకం, బయో డీజిల్ మొక్కల పెంపకం ద్వారా పంచాయతీల ఆదాయం వృద్ధికి చర్యలు
• ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటి సరఫరా లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులు
• పల్లె పండుగ పనుల నాణ్యతను సర్పంచులూ పర్యవేక్షించాలి
• ఇది మొండి ప్రభుత్వం కాదు… వినే ప్రభుత్వం…
• పంచాయతీల సమస్యలు వినేందుకు ప్రతి నెలా సమావేశం
• పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ప్రతినిధులతో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని ఇష్టానుసారం నిర్వీర్యం చేసింది. పంచాయతీల్లో స్వపరిపాలన, సుపరిపాలనకు చోటు లేకుండా చేసింది. ఆర్ధిక విచ్చలవిడితనంతో పంచాయతీల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. సర్పంచులకు విలువ లేకుండా చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. దీనిని సరిచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం. ఆయన అనుభవంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు.