SAKSHITHA NEWS

తెలంగాణలో కొత్త టీచర్ల నియామకాల్లో 47శాతం మహిళలే?

హైదరాబాద్:
తెలంగాణలో ఇటీవల జరిగిన డీఎస్సీ-2024 టీచర్ ఉద్యోగ పరీక్షలో మహిళలు సత్తా చాటారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులతో 47 శాతం మహిళలే ఉన్నారు. కాగా ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వ టీచర్లలో 50 శాతానికిపైగా మహిళలున్నారు.

ఉద్యోగ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు ఉండడం వంటి అంశాల వల్ల.. ప్రభుత్వం కొలువుల్లో మహిళలకు ఉద్యోగావ కాశాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదే ఒకటే కాదు అనేక కారణాలు కూడా మహిళలను ప్రభుత్వ కొలువుల చేరువలో ఉంచుతున్నాయి.

అయితే.. 2017లో నిర్వహించిన డీఎస్సీతో పోలిస్తే 2024 డీఎస్సీలో మహిళల సంఖ్య తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. 2017 డీఎస్సీలో 55-60 శాతం మంది వరకు మహిళలు టీచర్ ఉద్యో గాలకు ఎంపికయ్యారు.

కాగా ఈసారి డీఎస్సీలో అది 47 శాతానికి పడిపోయింది. అంటే గతంతో పోలిస్తే ఇది 8-15 శాతం తగ్గినట్లు. మొత్తం 10,006 ఉద్యోగుల్లో 5,300 మంది పురుషులు, 4,706 మంది మహిళలు ఉన్నారని విద్యాశాఖ అధి కారులు చెబుతున్నారు.

ఈసారి డీఎస్సీ పరీక్షలు సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాంతర రిజర్వేషన్‌ హారిజాంటల్‌,విధానాన్ని అమలు చేయడంతో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్లు ఉండవు. దీంతో ఉద్యోగాల్లో మహి ళలు తగ్గారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

జీతాల లెక్కలు…
కొత్తగా ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఆ వయసు వారిలో 5,411మంది అంటే 54 శాతం ఉన్నారు.

ఆ తర్వాత 31-40 మధ్య వయసు వారిలో 3,619 మంది ఉన్నారు. ఎస్జీటీలకు మొత్తం వేతనం నెలకు రూ.43,068,(మూల వేతనం రూ.31,040), స్కూల్‌ అసిస్టెంట్లకు రూ.58,691(మూల వేతనం రూ.42,300) అందనుంది.

ఎంపికైన 10,006 మందిలో ఎస్జీటీలు 7,388, ఎస్‌ఏలు 2,618 మంది ఉన్నారని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.


SAKSHITHA NEWS