పేట పురపాలక సంఘంలో అక్రమ నిర్మాణాల పర్వం
టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్పై తీవ్ర ఆరోపణలు
చిలకలూరిపేట మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతి ప్లానింగ్ విభాగంగా మారిపోయింది. పట్టణంలో అనుమతి లేని నిర్మాణాలను అడ్డుకోవలసిన పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సొమ్ములు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో పాటుగా పట్టణంలో అక్రమ నిర్మాణాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పురపాలక సంఘంలోని టౌన్ ప్లానింగ్ విభాగం, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తీరుపై పట్టణ ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాభివృద్ధి, నిబంధనలను పక్కన పెట్టి, అక్రమ ఆదాయమే లక్ష్యంగా సూపర్వైజర్ వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు
కొన్ని నెలల క్రితం పట్టణంలోని ఒక ప్రముఖ ఆసుపత్రి కూల్చివేయబడిన స్థలంలో, ఎలాంటి ప్లాన్ ఆమోదం లేకుండానే సూపర్ మార్కెట్ నిర్మాణం జరుగుతోందని ఈ నిర్మాణం కోసం భారీ గుంతలు తవ్వుతున్నారు. ప్రస్తుతం తుఫానుల నేపథ్యంలో, చుట్టూ ఇళ్లు, పక్కనే ఆసుపత్రులు ఉన్న ప్రాంతంలో ఇటువంటి గుంతలు తవ్వడం వలన ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భద్రతా ప్రమాణాలను, పురపాలక నిబంధనలను పూర్తిగా విస్మరించడంపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
నందిపాడు రోడ్డులో అనుమానాస్పద నిర్మాణం
ఇదే విధంగా, పట్టణంలోని నందిపాడు రోడ్డులో కూడా భారీ షెడ్డు నిర్మాణం అనుమతి తీసుకున్నారో లేదో తెలియకుండానే జరుగుతోందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేటలో ఇలాంటి నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలు లెక్కకు మించి ఉన్నాయని పట్టణవాసులు పేర్కొంటున్నారు.
కనబడని అక్రమాలు? కాసుల మత్తులో ఉన్నారా?
పట్టణంలో బహిరంగంగా జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలన్నీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్‌కు కనబడట్లేదా? లేదా కనబడుతున్నా, అక్రమ కాసుల మత్తులో ఉండి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అని పట్టణ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలు లేకుండా ఇటువంటి భారీ అక్రమ నిర్మాణాలు జరగడం అసాధ్యమనేది ప్రజల అభిప్రాయం.
తుఫానుపై శ్రద్ధకు బదులు ఆదాయంపై దృష్టి
ప్రస్తుతం అధికార యంత్రాంగమంతా తుఫానుల నుండి ప్రజలను రక్షించడానికి, సహాయక చర్యలపై శ్రద్ధ పెట్టిన తరుణంలో, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మాత్రం అక్రమ ఆదాయంపై దృష్టి సారించారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల భద్రతకు, పట్టణ ప్రణాళికకు సంబంధించిన కీలక విభాగంలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
చిలకలూరిపేట పట్టణంలో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై, టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపించాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న నిర్మాణాలు, వాటికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, అక్రమ నిర్మాణాల వలన భవిష్యత్తులో పట్టణ ప్రజలకు పెను ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
