పోలీసు శాఖచే మెగా రక్తదాన శిబిరం
** శిబిరాన్ని ప్రారంభించిన తిరుపతి జిల్లా ఎస్పీ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రక్తదానం ద్వారా ప్రజలకు ప్రాణదానం చేసే అవకాశం రావడం చాలా సంతోషం అనే ఆశయంతో తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక మంగళం ఆశాలత కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ప్రారంభించారు. ఇందులో అదనపు ఎస్పీలు రవి మనోహర చారి-శాంతి భద్రతలు, నాగభూషణ రావు-నేర విభాగం, శ్రీనివాస రావు-సాయుధ దళం, డిఎస్పీలు ఎస్బి-వెంకట నారాయణ , శ్రీలత -మహిళా, డియస్పిలు ప్రసాద్ (చంద్రగిరి) శ్రీనివాసులు (రేణిగుంట), రామకృష్ణ ఆచారి (ట్రాఫిక్), ఏఆర్- చందు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేసి పోలీసు అమర వీరులకు సంఘీభావం తెలిపిన పోలీసులు, ప్రజలు, విద్యార్థులకు అభినందనలు అని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను, విశిష్ట సేవలను స్మరించుకుంటూ వారికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.
తిరుపతి, చంద్రగిరి, తిరుమల, రేణిగుంట, పుత్తూరు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసులు, ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేశారన్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అందజేస్తున్నామన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమని.. రోడ్డు ప్రమాదాలు, మేజర్ సర్జరీలు వంటి అత్యవసర సమయాలలో ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని బాధితులకు అందించి ఎంతోమంది ప్రాణాలను నిలిపే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాకేంద్రం తిరుపతిలో 580 మంది రక్త దాతలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొత్తం 580 యూనిట్ల రక్తాన్ని దానం చేశారన్నారు. రక్త దాతలను అభినందిస్తూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రశంసా పత్రాలను అందజేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్త దాతలు మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యంలో మేము భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అహర్నిశలు సమాజ భద్రతే ధ్యేయంగా పనిచేసి అమరులైన పోలీసుల ప్రాణ త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు సందర్భంగా అమరులైన పోలీసులు అందరికీ మొదటగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. అమరులైన వారి త్యాగనిరతికి నిదర్శనంగా సమాజంలో ఒక మనిషి ఇంకో మనిషి కి రక్తదానం చేయడం వలన ప్రాణదానం చేయవచ్చుననే శుభసంకల్పం తో ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేశారు.
