రైతు బంధు ఇస్తే ఓ రాజకీయం.. ఇవ్వకపోతే మరో రాజకియం !
తెలంగాణ రాజకీయం ఇప్పుడు రైతు బంధుకు షిఫ్ట్ అయింది. నిన్నటిదాకా ఇవ్వలేదన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇస్తూంటే.. ఎందుకు ఆంక్షలు పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఇదే నేతలు బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు దుర్వినియోగం అయిందని పంటలు పండించని రైతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బడా బాబులకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అందరికీ ఇవ్వకుండా ఎందుకు కోతలు పెడుతున్నారని అంటున్నారు. ఈ రాజకీయానికి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చేందుకు తడబడుతోంది.
రైతు బంధు అంటే పంటలు వేసే రైతులకు పెట్టుబడి సాయంచేయడం. మరి పంటలు వేయని రైతులకు ఎందుకు సాయం చేయాలి..భూముల్ని వెంచర్లుగా మార్చిన వారికి ఎందుకు సాయం చేయాలి అంతకు మించి వందల ఎకరాల భూస్వాములకు ఎందుకు ఇవ్వాలి.. ప్రజాధనాన్ని ధనవంతులు ఇస్తూ ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అనే ప్రశ్నలు బీఆర్ఎస్ హయాంలోఎక్కువగా వచ్చింది. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతుబంధు విషయంలో ఆంక్షలు పెట్టాలని అనుకుంది. మూడో సారి గెలిచిన తర్వతా ఖచ్చితంగా ఫిల్టర్ చేస్తామని కేటీఆర్ చెప్పిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రజాధనాన్ని అందరికీ ఉచితంగా పంచడం కన్నా అవసరమైన వారికి.. అర్హత ఉన్నవారికి ఇవ్వాలనుకుంటోంది.. అందుకే పంటలు వేసిన వారికి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే గతంలో ఇలా ఫిల్టర్ చేయడాన్ని సమర్థించిన పార్టీలు ఇప్పుడు తేడాగా స్పందిస్తున్నాయి. రైతు బంధును ఎగ్గొట్టడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. రైతులు కాని వారికి.. పంటలు సాగు చేయని వారికి రైతుబంధు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ధైర్యంగా కౌంటర్ ఇవ్వలేకపోతోంది. అందుకే ఇతర పక్షాలు దాడులు తీవ్రతరం చేస్తున్నాయి.