రంగ రంగ వైభవంగా హిజ్రాల పెళ్లి వేడుకలు
కరీంనగర్: దేశవ్యాప్తంగా శ్రీసీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వైష్ణవ ఆలయాల్లోనే కాక శైవ ఆలయాల్లోనూ ఈ వేడుకను
ఆలయ పాలకవర్గాలు అంగరంగ వైభవంగా నిర్వహించాయి. దేశంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా కనిపించని ఓ విశిష్టత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి ప్రత్యేకం.
దక్షిణ కాశీగా పిలవబడే ఈ ఆలయంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం శివపార్వతులకు (హిజ్రా) కైలాసమే దిగివచ్చినంత సంబరం. ఇక్కడ జరిగే రాములోరి కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి జోగినిలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
శివుడిని జోగినీలు పరిణయం ఆడటం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని మార్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని అనేకమంది మహిళలు తమకు తాము శివుడికి సమర్పించుకొని శివపార్వతులుగా మారిపోతున్నారు. శ్రీసీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా వేములవాడ చేరుకునే వీరు ‘ధారణ’ పేరుతో.. శివుడితో తమ పరిణయ బంధాన్ని పునరుద్ధరించుకుంటు న్నారు.
వేములవాడ ఆలయంలో విశ్వక్సేన పూజతో ప్రారంభమై ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రదాయ పద్ధతిలో జరిగే కళ్యాణ తంతులో శివపార్వతుల హడావుడి ఎక్కువ. శోభాయమానంగా అలంకరించిన వేదికపై శ్రీసీతారాముల మాంగల్య ధారణ, తలంబ్రాల ఘట్టం జరుగుతుండగానే శివపార్వతులు జీలకర్ర బెల్లాన్ని తమ తలపై ఉంచుకొని… తలంబ్రాలు చల్లుకొనే దృశ్యం.. మరెక్కడా కానరాదు.
శివుడిని తమ భర్తగా భావించి ఆయనను వివాహం ఆడడం వింతగా అనిపించినా, హిజ్రాలు మాత్రం ప్రతి సంవత్సరం జరిగే ఈ ముహూర్తం కోసమే ఎదురు చూస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి జోగినీలుగా పిలవబడే హిజ్రాలు వేములవాడ ఆలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో శివుడికి తమను సమర్పించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఘట్టం.
రుద్రాక్షలు మంగళసూత్రంగా, కాళ్లకు రాగిమట్టెలు, చేతిలో త్రిశూలం, శివసత్తుల పూనకాలు శివపార్వతుల పెళ్లిలో కనిపించే దృశ్యాలు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనే హిజ్రాల కోసం అవసరమైన వస్తు సామాగ్రి కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో సిద్ధంగా ఉంచుతారు. కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న హిజ్రాలు తమకు తోచిన రీతిలో స్వామివారికి కట్న, కానుకలు సమర్పించుకుంటారు.