SAKSHITHA NEWS

కేసీఆర్ పార్టీ.. .ఇండిపెండెట్ కంటే దారుణంగా మారిందా?

తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరుతో రాజ‌కీయ వేదిక‌ను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంత‌రం భార‌త రాష్ట్ర స‌మితి పేరుతో భార‌త రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి ఎద‌గాల‌ని భావిస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ పార్టీ అదే తెలంగాణ‌లో ఊహించ‌ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంటోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోవ‌డం , పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా ద‌క్క‌క‌పోవ‌డం అనే ద‌శ‌కు కొన‌సాగింపుగా ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మారిపోయాయ‌ని విశ్లేష‌కులు కామెంట్లు చేస్తున్నారు.

తెలంగాణ‌లో మ‌రోమారు కీల‌క ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల‌కు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది కూడా! ఈ నేప‌థ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ, బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న‌ బీజేపీ పార్టీ నేతలు త‌మ‌దైన శైలిలో వ్యూహాలో మునిగిపోయారు. అయితే, ప్ర‌ధాన‌ ప్రతిపక్షమైన‌ బీఆర్ఎస్‌ పరిస్థితి చిత్రంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున టికెట్ ఆశిస్తున్న నేతలు త‌మ‌దైన శైలిలో ఓట‌ర్ల న‌మోదుపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్‌ శ్రేణులు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.

పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ప్రధాన రాజకీయ పార్టీల నేతుల‌ భారీగా ఎన్‌రోల్‌ మెంట్‌ చేయిస్తున్నారు.
మరోవైపు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకునే ఔత్సాహికులు సైతం ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని త‌మ ప‌రిచ‌యాల‌ను ఇందుకోసం ఉప‌యోగించుకుంటున్నారు. అయితే, బీఆర్ఎస్‌ పార్టీలో ఎలాంటి చ‌డీసప్పుడు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎవరు సీరియస్‌గా తీసుకోవడం లేదని సొంత పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, బీఆర్ఎస్‌ శ్రేణుల్లో ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు న‌మోదుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓటర్లు నమోదులో ప్ర‌ధాన పార్టీ దూసుకెళ్తుండ‌టం, ఆఖ‌రికి ఇండిపెండెంట్లు సైతం క్రియాశీల‌కంగా ఉంటే… తాము మాత్రం ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా పోవ‌డం చూస్తుంటే… ప్ర‌తిప‌క్ష పార్టీల‌ నేతలు త‌మ‌ను ఇండిపెండెట్ పార్టీ కంటే త‌క్కువ‌గా చూసే అవ‌కాశం ఉంటుంద‌ని అంత‌ర్గ‌తంగా వాపోతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం, ఎన్‌రోల్‌మెంట్ గురించి కేసీఆర్ మ‌దిలో ఏముందో మ‌రి.


SAKSHITHA NEWS