విద్యుత్ రంగంలో ఆవిష్కరణలకు హ్యాకథాన్‌

Sakshitha news

విద్యుత్ రంగంలో ఆవిష్కరణలకు హ్యాకథాన్‌

— ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి

విశాఖపట్నం, అక్టోబర్ 15:
రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) స్థాపించిన Centre of Excellence for Energy Transition (CoEET), Andhra Pradesh, క్లైమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యుత్ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు “HackAP Hackathon” నిర్వహించనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యుత్ రంగానికి సంబంధించిన వాస్తవ సమస్యలకు వినూత్న సాంకేతిక పరిష్కారాలు అందించగల స్టార్టప్ సంస్థలు ఈ హ్యాకథాన్‌లో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లకు స్మార్ట్, డేటా ఆధారిత, ఆధునిక సాంకేతిక పరిష్కారాలను కనుగొనడం ఈ హ్యాకథాన్ ప్రధాన లక్ష్యమని వివరించారు.

హ్యాకథాన్‌లో ఎంపికైన స్టార్టప్‌లు తమ పరిష్కారాలను రాష్ట్ర విద్యుత్ రంగ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించే అవకాశం పొందడంతోపాటు, విజేతలకు పైలట్ ప్రాజెక్టులు మరియు మూడు డిస్కామ్‌లలో పూర్తి స్థాయి ప్రాజెక్టులను అమలు చేసుకునే అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

హ్యాకథాన్‌లో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు (Problem Statements):

  1. ప్రమాదాలను ముందస్తుగా గుర్తించే (Predictive Maintenance) వ్యవస్థ:
    డ్రోన్ ఆధారిత ఇన్‌స్పెక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణల ద్వారా విద్యుత్ మౌలిక సదుపాయాల స్థితిని అంచనా వేసి, సమయపాలిత మరమ్మతులకు బదులుగా పరిస్థితి ఆధారిత సంరక్షణ విధానాన్ని ప్రవేశపెట్టడం.
  2. స్మార్ట్ మీటర్ డేటా విశ్లేషణ ద్వారా ఆదాయ సంరక్షణ:
    ప్రతి 15 నిమిషాలకు నమోదయ్యే స్మార్ట్ మీటర్ డేటాను విశ్లేషించి విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలు, రివెన్యూ లీకేజీలను గుర్తించేందుకు అనలిటిక్స్ పరిష్కారాల అభివృద్ధి.
  3. ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్యూర్ ప్రిడిక్షన్:
    స్మార్ట్ మీటర్ మరియు అవుటేజ్ డేటాను విశ్లేషించి ట్రాన్స్‌ఫార్మర్ పనితీరు, లోడింగ్, ఫాల్ట్ ప్యాటర్న్‌ల ఆధారంగా విఫలమయ్యే అవకాశాలను ముందుగానే గుర్తించడం.
  4. హైటెన్షన్ లైన్లలో ఇన్సులేటర్ వైఫల్యాల గుర్తింపు:
    థర్మల్, ఆప్టికల్, అల్ట్రావయొలెట్ లేదా అకౌస్టిక్ సెన్సింగ్ పద్ధతుల ద్వారా పగటి, రాత్రి సమయాల్లోనూ ఇన్సులేటర్ లోపాలను సురక్షితంగా గుర్తించే సాంకేతిక పరిష్కారాల అభివృద్ధి.

విద్యుత్ రంగం మరియు ఇంధన పరివర్తనలో శిక్షణ, పరిశోధన, సాంకేతిక మార్పులను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్థాపించిన Centre of Excellence for Energy Transition (CoEET).. స్టార్టప్‌లకు సహకార వేదికగా వ్యవహరిస్తోందని సీఎండీ తెలిపారు.
సుస్థిర సాంకేతిక అభివృద్ధికి మద్దతు ఇస్తున్న అంతర్జాతీయ సంస్థ Climate Collective Foundation కూడా భాగస్వామ్య సంస్థగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుందని తెలిపారు.

విశాఖపట్నంలో జరగనున్న ఈ హ్యాకథాన్‌ను ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ — మూడు డిస్కామ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

మరిన్ని వివరాల కోసం, రిజిస్ట్రేషన్ కోసం https://electronvibe.com/hackap-hackathon/
వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

అక్టోబర్ 22వ తేదీ రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని, రాష్ట్రంలోని స్టార్టప్‌ సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎండీ పృథ్వీతేజ్ పిలుపునిచ్చారు.