మూడు వైపులా “గ్రేటర్ తిరుపతి” అభివృద్ధి

Sakshitha news

మూడు వైపులా “గ్రేటర్ తిరుపతి” అభివృద్ధి

** టీటీడీ సహకారం లేని తిరుపతిని ఊహించలేం

** నగరపాలక కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు
…..

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రస్తుత తిరుపతి నగరానికి మూడు వైపులా విస్తరణ ఉండేలా చేసి “గ్రేటర్ తిరుపతి” గా మార్పు చేయాలని నగరపాలక కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసింది. తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన మంగళవారం ఎస్వీయూ సెనేట్ హాల్ లో జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, నగర కమిషనర్ నారపురెడ్డి మౌర్య, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
గ్రేటర్ పరిధిలోకి 10 గ్రామ పంచాయతీలను విలీన ప్రతిపాదనను ప్రభుత్వం చేయగా నగర మేయర్ శిరీష విలీన ప్రాంత పరిధిని విస్తరిస్తూ సవరణ తీర్మానం ప్రతిపాదించారు. సవరణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మేయర్ మాట్లాడుతూ
ప్రభుత్వ ప్రతిపాదనకు పరిపుస్టత చేకూర్చడం కోసమే సవరణ తీర్మానం. మన ప్రతిపాదనలు భవిష్యత్తులో ప్రశ్నార్ధకం కాకూడదు. సరైన నిర్ణయాలు చేయలేదన్న అపవాదు మన మీద రాకూడదు. అందులో
మన తిరుపతి నగరం మహానగరంగా ఎందుకు మారాలి ? మార్పునకు ప్రామాణికంగా ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అన్నది ముఖ్యం అన్నారు. గ్రేటర్ తిరుపతి సరిహద్దులు ఎంత వరకు ఉండాలి అన్నది కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాలని మేయర్ సూచించారు. టీటీడీతో సంబంధం లేని తిరుపతిని ఊహించుకోలేము. శ్రీవారి భక్తుల రాకపోకలు, వసతుల కల్పన కూడా కీలకం. స్థూలంగా ప్రస్తుత నగరం పై ఒత్తిడి తగ్గాలి.. తగ్గే ఒత్తిడి విలీన ప్రాంత అభివృద్ధికి దోహదపడాలి. ఇందుకోసం
గ్రేటర్ హైదరాబాద్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రేటర్ హైదరాబాద్ చేసినప్పుడు కోర్ హైదరాబాద్ కి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు, 10 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీకి కిలోమీటర్ల దూరంలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నిర్మాణం చేపట్టారు. నాడు అందరూ అన్ని కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అవసరమా ? అన్నారు నేటి అనుభవం ఏమి చెపుతుంది. నాడు దూరం అయిన శంషాబాద్ ఎయిర్ పోర్టు నేడు దగ్గర అయినది.. కిలోమీటర్ల దూరంలో రింగ్ రోడ్డు నిర్మాణం చేయకపోతే నగర విస్తరణ తర్వాత రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యం అయ్యేదా ? నగర విస్తరణ తర్వాత మౌలిక సదుపాయాలు కల్పన కష్టం హైదరాబాద్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాగా దూరదృష్టితో ముందే ఏర్పాటు చేయడం సులభం.. తిరుపతి నగరంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్న శ్రీవారి భక్తుల రాకపోకలు తమిళనాడు నుంచి పుత్తూరు వైపు, కర్ణాటక నుంచి చంద్రగిరి వైపు, ఏపీ నుంచి శ్రీకాళహస్తి వైపు ఉంటాయి. భవిష్యత్తులో అందుకు అనుగుణంగా వారికి సౌకర్యాలు ఏర్పాట్లు చేసుకోవాలి. మన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. నగర పాలక సంస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూమి. ప్రస్తుత నగర పరిధిలో ఉన్న భూమి టీటీడీ, మఠం భూమి మాత్రమే ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా భూమి లేకపోవడం ప్రధాన ఆటంకంగా మారుతుంది. గ్రేటర్ తిరుపతిలో వీలైనంత ప్రభుత్వ భూమి అందుబాటులోకి వచ్చే విధంగా ఆలోచించాలి.

మూడు వైపులా ఇవీ పరిధులు

పడమర వైపు చంద్రగిరి మండలం కల్యాణి డ్యామ్ వరకు… దక్షిణం వైపు రామచంద్రాపురం మండలం రాయలచెరువు వరకు…ఆగ్నేయంలో అంజేరమ్మ కనుమ వరకు… తూర్పున ఐఐటీ వరకు ఉండాలి అని కౌన్సిల్ తీర్మానం చేసింది. కల్యాణి డ్యామ్ మన నీటి సరఫరాకు కీలకం. అలాంటి డ్యామ్ నగర పరిధిలో లేకుంటే క్లిష్ట సమయంలో నీటి సరఫరాకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. అలాగే రాయలచెరువు గ్రేటర్ నగర పరిధిలోకి వస్తె భవిష్యత్తు నీటి సరఫరాకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ మొత్తం ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్, వెస్ట్ స్టేషన్, చంద్రగిరి, తిరుచానూరు, రేణిగుంట, ఏర్పేడు రైల్వేస్టేషన్లు కూడా నగర పరిధిలోకి వస్తాయి. రాయలచెరువు, మల్లిమడుగు, కల్యాణి డ్యామ్, విస్తారంగా చెరువులు, ప్రభుత్వ భూమి మనకు అందుబాటులోకి వస్తాయి. మేయర్ ప్రతిపాదించిన గ్రేటర్ తిరుపతి విస్తరణ ప్రతిపాదనపై సభ్యులు సానుకూలంగా స్పందిస్తూ తమ అంగీకారాన్ని తెలపడంతో కౌన్సిల్ ఆమోదించినట్లు మేయర్ డాక్టర్ శిరీష ప్రకటించారు.

Scroll to Top