వీర్లపల్లి ప్రజలకు శుభవార్త….
250కిపైగా కుటుంబాలకు త్వరలో పునరావాస ఫ్లాట్లు….
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : ఎన్నికల సమయంలో వీర్లపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన పునరావాస హామీని అమలు చేస్తూ, గ్రామంలోని 250కిపైగా కుటుంబాలకు త్వరలో పునరావాస ఫ్లాట్లు నిర్మించి అందజేస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు.
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీర్లపల్లి గ్రామ ప్రజలతో సమావేశమైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ ప్రభావంతో గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం గానీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం గానీ పునరావాసం కల్పించడంలో సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో పలుమార్లు సమావేశమై వీర్లపల్లి గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టామని వెల్లడించారు.
వీర్లపల్లి గ్రామంలోని 250కిపైగా కుటుంబాలకు పునరావాస ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే పరిశీలించినట్లు పేర్కొంటూ, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఫ్లాట్లు అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా 21వ. డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొక్కిరాల శ్రీనివాస్, వీర్లపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పునరావాస సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
