అమ్మాయిలు బాల్య వివాహాలను వ్యతిరేకించాలి.. రక్తహీనతపై అవగాహన కలిగి ఉండాలి

Sakshitha news

అమ్మాయిలు బాల్య వివాహాలను వ్యతిరేకించాలి.. రక్తహీనతపై అవగాహన కలిగి ఉండాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

బాలికలు పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి, ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలి: జిల్లా ఎస్పీ సునీత రెడ్డి


ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల్లో భాగంగా స్నేహా బాలికల సంఘాల మాక్ పార్లమెంట్ నిర్వహణ

*సాక్షిత వనపర్తి *:
అమ్మాయిలు బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ, సమాజంలో అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహా (కిషోర బాలికల సంఘాలు)కు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాలికలు ప్రధాన మంత్రి, స్పీకర్, ఎంపీల పాత్రలను ఎంతో ఉత్సాహంగా పోషిస్తూ పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా సంక్షేమం, మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, వరి కొనుగోలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సామాజిక అంశాలపై చర్చించారు.

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ కిషోర బాలికల కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. సమాజంలో ఐక్యత చాలా ముఖ్యమని, బాలికల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహించడం మంచి సాధనగా అభివర్ణించారు. సమావేశంలో విద్యార్థినులు మహిళల్లో రక్తహీనత, సమాజంలో జరుగుతున్న పలు సమస్యలపై ప్రశ్నలు అడగడం అభినందనీయమని అన్నారు. పార్లమెంట్‌లో చర్చించినట్లుగా ప్రతి ఒక్కరూ రక్తహీనత పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా మరియు బలంగా ఉండాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా స్ఫూర్తి పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, వాటిపై గళం వినిపించాలని అన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. గత మూడు సంవత్సరాల్లో జిల్లాలో 60 బాల్య వివాహాలు జరిగినట్లు తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహ సమాచారం తెలిసినా వెంటనే 1098 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని కోరారు. విద్యార్థినులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ బాలికలు మధ్యలో చదువులు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. బాలికలకు విద్యనే అత్యంత ప్రాధాన్యత కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను సాధించాలని అన్నారు. ప్రస్తుత కాలంలో బాలికలకు అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని అవగాహనతో అధిగమించాలని సూచించారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ పోక్సో చట్టంపై అవగాహన ఉండాలని తెలిపారు. ప్రతి విషయాన్ని ప్రశ్నించే అలవాటు పెంపొందించుకోవాలని, ఏ రంగంలో ఉన్నా ఉత్తమ స్థానాన్ని సాధించాలని అన్నారు. అలాగే అవసరమైన సందర్భాల్లో ధైర్యంగా “నో” చెప్పే అలవాటు కూడా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్ చెక్కులను, ఎఫ్ పి ఓ సంఘాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా బాలికల సంరక్షణకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

సమావేశంలో డిఆర్డిఓ ఉమాదేవి, డీఎస్పీ బాలాజీ నాయక్, డి సి ఓ రాణి, డి ఐ ఓ జ్యోతి, డి డబ్ల్యు ఓ సుధారాణి, డిఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, డి ఐ ఈ ఓ నరేంద్ర, కేజీబీవీ అధికారిని, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, విద్యార్థులు, స్నేహ సంఘాల బాలికలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top