జూన్ 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభం
- ఇంటర్‌లో కొత్తగా ACE గ్రూప్ ప్రవేశపెట్టిన విద్యామండలి
- విద్యార్థులకు డిజిటల్ బోధన, పోటీ పరీక్షల ప్రత్యేక శిక్షణ
- జిల్లాలో 12 కళాశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షిత : జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి పునఃప్రారంభం కానున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నరేంద్ర కుమార్ తెలిపారు. జిల్లాలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, పాన్‌గల్, ఖిల్లాఘన్‌పూర్, వీపనగండ్ల, గోపాల్‌పేట, పెద్దమందడి ప్రాంతాల్లో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కళాశాలల్లో MPC, BiPC, CEC గ్రూపులతో పాటు కొన్ని చోట్ల HEC, వృత్తి విద్యా కోర్సులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పోటీ పరీక్షల సన్నద్ధత కోసం ప్రతి కళాశాలలో డిజిటల్ బోధన సదుపాయాలు కల్పించడంతో పాటు ఫిజిక్స్ వాలా సహకారంతో EAPCET, NEET, IIT-JEE, CLAT పరీక్షలకు ప్రత్యేక డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ACE (Accountancy, Commerce and Economics) అనే కొత్త గ్రూపును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అలాగే ప్రథమ సంవత్సరం సిలబస్ పూర్తిగా సవరించబడిందని, పాఠ్యపుస్తకాలు ఇప్పటికే కళాశాలలకు చేరాయని పేర్కొన్నారు. సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 15 మార్కుల ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టగా, గణితశాస్త్రం, భాషా, హ్యూమానిటీస్ సబ్జెక్టుల్లో అంతర్గత మూల్యాంకనానికి ప్రాధాన్యం పెంచినట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతూ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కోరారు.

