“వరద ముప్పు నివారణకు యుద్ధ ప్రాతిపదికన కాలువల పూడిక తొలగింపు….
–అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ…
– మేయర్ మహంకాళి స్వామి….
సాక్షిత పెద్దపల్లి: జిల్లా ప్రతినిధి: రామగుండం, వర్షాకాలంలో వరద ముప్పును నివారించేందుకు నగరంలోని కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా శనివారం ఒకటవ డివిజన్‌లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) , నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీతో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు మడిపెల్లి మల్లేష్ కాలనీలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
మేయర్ ఆదేశాల మేరకు జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్, చైన్ జేసీబీ, బాబ్‌క్యాట్, జెట్టింగ్ యంత్రం, పారిశుద్ధ్య సిబ్బంది సహాయంతో పి.కె. రామయ్య కాలనీ, పట్టణ ప్రకృతి వనం సమీపంలోని వీధుల్లో పూడికతో నిండిపోయిన ఉపరితల కాలువలను పూర్తిగా శుభ్రం చేశారు. తుప్పలు, పొదలు, పిచ్చి చెట్లు పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా మారిన ప్రాంతాలను యంత్రాల సహాయంతో తొలగించి రహదారులను విశాలంగా మార్చారు.
అలాగే పట్టణ ప్రకృతి వనంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు భూగర్భ జలాల పెరుగుదల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటుకు ఇంకుడు గుంతలను సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, కాలనీ ఏర్పడిన నాటి నుంచి కాలువల్లో పూడిక తొలగించిన ఆనవాళ్లు కూడా లేవని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అవసరమైతే ఒకటవ డివిజన్‌లో మరికొన్ని రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. గతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న పి.కె. రామయ్య కాలనీలో ఎమ్మెల్యే చొరవతో విశాల రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. మిగిలిన పనులను కూడా డీఎంఎఫ్‌టీ, ఎన్‌టీపీసీ సిఎస్‌ఆర్ నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడికను ఇప్పుడు తొలగించడం జరుగుతోందని, ఎమ్మెల్యే కృషితో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఋతుపవన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వర్షాకాలం రాకముందే కాలువల పూడిక తొలగింపు పనులు ప్రారంభించామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మురుగునీటి కాలువల శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంగళ బాపు, నగర పాలక సంస్థ ఎస్‌ఈ గురువీర, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఏఈ తేజస్విని, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, సీనియర్ అకౌంటెంట్ రాజ్‌కుమార్, జవాన్ సూర్య, నగర పాలక సంస్థ సిబ్బంది, మెప్మా ఆర్‌పీలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
