కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చ అయింది. కార్పొరేషన్ వేదికపై మేయరు సురేశ్‌బాబు పక్కనే సీటు కేటాయించాలంటూ ఎమ్మెల్యే మాధవి, ఆమె మద్దతుదారులైన కార్పొరేటర్లు నిరసనకు దిగారు. గత భేటీ మాదిరిగా ఈసారి కూడా వేదికపై మేయరు కుర్చీ మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తొలుత తన కుర్చీ కథ తేల్చిన తర్వాతే సమావేశం మొదలుపెట్టాలని పట్టుబట్టారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 8 మంది కార్పొరేటర్లు కూడా ఆమెకు మద్దతుగా నిల్చారు. మేయరుకు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా కార్పొరేటర్లు.. ‘అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా, మహిళలంటే చిన్నచూపా’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.
మాధవికి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లు ముక్కెర సుబ్బారెడ్డి, మానస, నాగేంద్ర, ఎ. లక్ష్మీశ్రీదేవి, కె. సూర్యనారాయణ, జఫ్రుల్లా, చల్లా స్వప్న, కట్టమీద అరుణలను మేయరు సస్పెండ్ చేశారు. సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి 3 గంటలకు మేయరు, కార్పొరేటర్లు వచ్చారు. అప్పటికే వేదికపై నిలబడి ఉన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘మేయరు, కార్పొరేటర్లకేమో చికెన్ ముక్కలు, బిరియాని.. పోలీసులకు, పాత్రికేయులకు పప్పన్నం పెడతారా?’’ అని మండిపడ్డారు. చివరకు అజెండాలో పొందుపరిచిన 52 అంశాలకు కార్పొరేటర్లంతా ఏకగ్రీవంగా ఆమోదించారంటూ తీర్మానం చేసి మేయరు సమావేశం ముగించారు.