ఉమ్మడి ఏపీలో 31రోజులు సీఎంగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత!

సాక్షిత చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవ్వాల తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
రాజకీయ ప్రస్థానం – 31 రోజుల సీఎం!
వృత్తిరీత్యా న్యాయవాది అయిన భాస్కరరావు గారు, నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కి అత్యంత ఆప్తులుగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్థాపనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, పార్టీ జెండా, ఎజెండా రూపకల్పనలో కీలక సలహాలు అందించారు. 1983లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ‘ఆగష్టు సంక్షోభం’ సమయంలో ఆయన పేరు మారుమోగింది. 1984లో ఎన్టీఆర్ గారు గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లినప్పుడు, కాంగ్రెస్ మద్దతుతో నాదెండ్ల భాస్కరరావు సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఎన్టీఆర్ తిరిగి వచ్చాక చేపట్టిన ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ యాత్ర’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దాదాపు నెల రోజుల అనంతరం భాస్కరరావు ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం (కేవలం 31 రోజులు) ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి ఖమ్మం నుండి ఎంపీగా కూడా పనిచేశారు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న కుమారుడు నాదెండ్ల మనోహర్
భాస్కరరావు రాజకీయ వారసత్వాన్ని వారి కుమారుడు నాదెండ్ల మనోహర్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తండ్రిలాగే సౌమ్యుడు, మేధావిగా పేరు తెచ్చుకున్న మనోహర్ తెనాలి నియోజకవర్గం నుండి రెండుసార్లు (2004, 2009) ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో చిట్టచివరి స్పీకర్గా అత్యంత సమర్థవంతంగా పనిచేసి, క్లిష్ట పరిస్థితులను డీల్ చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో చేరి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తునిగా, పార్టీ కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
మాజీ సీఎం మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మనోహర్ కి చిలకలూరిపేట ప్రాంత జనసేన, టీడీపీ శ్రేణులు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాయి.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY