రేబిస్ తో బలైన ప్రాణం – తండ్రిని కోల్పోయిన చిన్నారులకు ఆర్ధికసాయం.
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామంలో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన పరాల సతీశ్ (34) రేబిస్ వ్యాధి లక్షణాలతో మృతిచెందడం అందరినీ కలిచివేసింది. ఎనిమిది నెలల క్రితం కుక్క కరిచిన ఘటనకు తగిన వైద్యం అందకపోవడమే ఈ విషాదానికి కారణమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. చికిత్స కోసం సతీశ్ ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయించినప్పటికీ, అక్కడ రేబిస్ ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడంతో తీసుకోలేకపోయాడు. రోజులు గడిచేకొద్దీ అతనిలో అస్వస్థత పెరిగి, చివరకు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న సతీశ్ ఆకస్మిక మరణంతో భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ దుర్ఘటన గ్రామ యువకులను కదిలించింది. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని యువకులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా సతీశ్ కుటుంబ దుస్థితిని ప్రజలకు తెలియజేశారు.
స్పందించిన సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామం మరియు పరిసర ప్రాంత గ్రామాల పెద్దలు, యువకులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి విరాళాలు అందించారు. ఇలా సమకూరిన మొత్తం రూ.37,000ను మృతుడి ఇద్దరు పిల్లల బౌషాత్ కోసం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సతీశ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, “నిరుపేదరికంలో ఉన్న మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోయాం. పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ చూపిన ఈ మానవత్వం మాకు జీవితాంతం గుర్తుండిపోతుంది” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తోచిన సాయాన్ని చేసిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒక వైపు వైద్య నిర్లక్ష్యంతో ఒక ప్రాణం పోయిన విషాదం… మరో వైపు గ్రామాల ఐక్యతతో అనాథ పిల్లలకు అందిన మానవతా అండ—ఈ ఘటన సమాజానికి ఆలోచన కలిగించే సందేశంగా నిలిచింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
