ఎస్పీ చేతుల మీదుగా హోంగార్డులకు ఆర్ధికసాయం
……
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లా పోలీస్ సిబ్బందికి సంక్షేమం, ఆత్మబలం, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మరో స్ఫూర్తిదాయక సేవకు శ్రీకారం చుట్టారు. అందులో
ఇటీవలి కాలంలో మరణించిన ఐదు మంది హోంగార్డుల కుటుంబాలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మొత్తం 21 మంది సిబ్బందికి ఎస్పీ స్వయంగా ముందుకు వచ్చి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.
మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం,
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సిబ్బందికి రూ.10,000, రూ.5,000 చొప్పున వైద్య చికిత్స కొరకు చేయూత అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “పోలీస్ శాఖ ఒక కుటుంబం. ప్రతి సిబ్బంది మన కుటుంబ సభ్యుడే. ఎవరికైనా కష్టాలు ఎదురైతే అందరం కలసి అండగా నిలవాలి. మన సహోద్యోగుల బాధ మన బాధగానే భావిస్తూ, వారికి అన్ని విధాల సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఏ సిబ్బంది అయినా ఇబ్బంది ఎదుర్కొంటే వెంటనే తెలియజేయాలి,” అని పేర్కొన్నారు. ఎస్పీ మానవతా చర్య జిల్లా పోలీస్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, “సేవ – సమర్పణ – సహచర్యం” అనే పోలీస్ విలువలను మరింత బలపరచింది. హోంగార్డుల సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు చేయూతనిచ్చిన ఈ చర్య పోలీస్ కుటుంబంలోని అనుబంధం, మానవత్వం, సేవాస్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ డిఎస్పి చిరంజీవి, ఏవో సురేష్ కుమార్, ఆర్ ఐ హరికృష్ణ, వెల్ఫేర్ హోంగార్డ్స్ పాల్గొన్నారు.
