టీడీపీ కార్యకర్తకు రూ.2లక్షల ఆర్ధిక చేయూత.
తెలుగుదేశం కార్యకర్త సంక్షేమ నిధి నుంచి మంజూరు.
చెక్కులను అందజేసిన టీడీపీ నాయకులు.
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు,
ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కుటుంబ సభ్యునికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. దీనికి సంబంధించిన చెక్కును స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లపూడిలోని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కార్యాలయంలో (టీడీపీ కార్యాలయం) బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జి.కొండూరు మండలం చిననందిగామ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కోయ సీతారామయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో సీతారామయ్య కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది.
ఈ సాయాన్ని చెక్కు రూపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ సర్పంచి ధనేకుల శ్రీకాంత్ , టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు మన్నం వెంకటరామయ్య చౌదరి , బూత్ కన్వీనర్ కోయ పాపారావు సీతారామయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. టీడీపీ కార్యకర్తలు సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ తొలి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఇదే గ్రామానికి చెందిన మద్దాల రఘువరన్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.40వేల చెక్కును కూడా అందజేశారు. ప్రజా సమస్యలపై చొరవచూపుతూ వారికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.