చదువుకు చేయూత.. జీఎన్‌ఎం విద్యార్థినికి మూడేళ్లపాటు ఆర్థిక సహాయం…

Sakshitha news

చదువుకు చేయూత.. జీఎన్‌ఎం విద్యార్థినికి మూడేళ్లపాటు ఆర్థిక సహాయం…

జీఎన్‌ఎం విద్యార్థినికి వెలుగు సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకిగా మారకూడదనే సంకల్పంతో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ (వీఎస్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో జీఎన్‌ఎం నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని సిరివేన అక్షయకు ఆర్థిక సహాయం అందించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీకి చెందిన అక్షయ చదువును పూర్తి చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని గోదావరిఖని మేదర్‌బస్తీలోని చంద్రశేఖర్ కిరాణా మర్చంట్ నిర్వాహకులు సీహెచ్ కిషోర్ తన తండ్రి సీహెచ్ చంద్రశేఖర్ స్మారకార్థం అందించేందుకు ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థినికి మూడు నెలలకు సంబంధించిన రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రానున్న మూడు సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.1,000 చొప్పున నేరుగా విద్యార్థిని బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ డా. సురభి శ్రీధర్ మాట్లాడుతూ, విద్య కోసం సమాజంలోని దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో తమ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.

విద్యార్థిని అక్షయ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, ప్రస్తుతం తన అమ్మమ్మ సంరక్షణలో జీవిస్తూ కూలి పనులతో జీవనం సాగిస్తున్న కుటుంబ పరిస్థితుల్లోనూ నర్సింగ్ విద్యను అభ్యసిస్తోందని వివరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అనంతరం సీహెచ్ కిషోర్ స్పందించి, తన తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థిని చదువు పూర్తయ్యే వరకు ప్రతి నెల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకోవడం సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

విద్యార్థి చదువుకు అండగా నిలిచిన సీహెచ్ కిషోర్, వారి కుటుంబ సభ్యులకు వెలుగు సంస్థ తరఫున డా. సురభి శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింత మంది దాతలు ముందుకు వచ్చి పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ గడవేన సదానందం, విద్యార్థిని కుటుంబ సభ్యులు, సంస్థ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Scroll to Top