ఎస్సీ వర్గీకరణ లేకుండా టీచర్ పోస్టులను భర్తీ చేయడం మాదిగలకు ద్రోహం చేయడమే.
-రేవంత్ రెడ్డి మోసాన్ని నిరసిస్తూ ఈ నెల 9న రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు.
-ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ మాదిగ.
శంకర్ పల్లి అక్టోబర్ 07:సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 11062 టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా అమలు చేయడం మాదిగ జాతికి నమ్మిక ద్రోహం చేయడమే అవుతుందని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ అన్నారు.
సోమవారం పత్రిక సమావేశంలో కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ ” మాదిగల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లు ఉందని అన్నారు. త్యాగాలు చేసి ముప్పై ఏళ్ళ పోరాటం ద్వారా సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటే ఆ ఫలాలు మాదిగలకు అందకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేయడం దారుణమని అన్నారు. మాల నాయకుల బ్లాక్ మెయిల్ కు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. ఇంత అత్యవసరంగా టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ లోని మాల నాయకుల ఒత్తిడి మేరకు ఎస్సీ టీచర్ పోస్టులన్ని మాలలకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని అన్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ఎదుర్కోవడానికి మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు. రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 9 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహల వద్ద నుండి కలెక్టర్ కార్యాలయాల వరకు నల్ల జెండాలతో భారీ ప్రదర్శనలులో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాల్లో నిరుద్యోగులు, విద్యావంతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.