రైతు సంక్షేమమే లక్ష్యం.. పెద్దపల్లిలో భారీ గోదాముల నిర్మాణానికి శ్రీకారం….
రూ.14.38 కోట్లతో 20 వేల మెట్రిక్ టన్నుల గోదాముకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పెద్దపల్లి నియోజకవర్గంలో భారీ గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో రూ.14.38 కోట్ల వ్యయంతో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం వ్యవసాయ ప్రధాన ప్రాంతమని, రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు జరిగే ప్రాంతాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. గత ఏడాది వేసంగి సీజన్‌లో నియోజకవర్గంలో 1.92 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, ఈసారి రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్న నేపథ్యంలో పంట నిల్వ కోసం గోదాముల అవసరం పెరిగిందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో గోదాముల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. లాలపల్లిలోనే నాబార్డ్ సహకారంతో మరో 14 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముకు కూడా త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
పంట మార్పిడి వ్యవసాయానికి లాభదాయకమని పేర్కొన్న ఆయన, వరితో పాటు మొక్కజొన్న, పామాయిల్, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని, భవిష్యత్తులో పామాయిల్ సాగును కూడా విస్తరించాలని రైతులకు పిలుపునిచ్చారు.
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే, తెలంగాణలో రైతులకు బోనస్‌లు, మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతుల సమస్యలను రాజకీయాలకు వాడుకోవడం మానేసి, కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత ఎరువుల కేటాయింపు సాధించాలని బీజేపీ నాయకులకు సూచించారు.
వచ్చే రెండున్నర సంవత్సరాల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణం చేపట్టి రైతులకు నిల్వ సౌకర్యాల సమస్య లేకుండా చేస్తామని ఎమ్మెల్యే విజయరమణరావు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
