రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విస్తరణ….
పెద్దపల్లి జిల్లాలో గత పదేళ్లలో రూ.900 కోట్ల రోడ్డు పనులు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.1,700 కోట్ల పనులు మంజూరు….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, సుల్తానాబాద్/ : రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో బుధవారం రూ.219.67 కోట్ల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం), నాన్‌ప్లాన్ రహదారి అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రజలు మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ప్రభుత్వ విప్ విజయరమణారావు ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే పెద్దపల్లి బైపాస్ రహదారికి నిధులు మంజూరు చేశామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏడాదిలోపు బైపాస్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.13 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రూ.17 వేల కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. హెచ్‌ఏఎం విధానంలో ప్రభుత్వం 40 శాతం, కాంట్రాక్టర్ 60 శాతం నిధులు భరించే విధంగా పనులు చేపడుతున్నామని, సుల్తానాబాద్‌లో శంకుస్థాపన చేసిన పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వారం రోజుల్లోనే పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు.
హైదరాబాద్–రామగుండం గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై కేంద్ర మంత్రితో చర్చలు జరిపామని, ఈ ప్రతిపాదిత రహదారిలో సుల్తానాబాద్ బైపాస్‌ను కూడా మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రహదారి భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
రూ.1,700 కోట్లతో రహదారి పనులు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గత పదేళ్లలో పెద్దపల్లి జిల్లాలో కేవలం రూ.900 కోట్ల రహదారి పనులు మాత్రమే మంజూరయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.1,700 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు.
రహదారుల అభివృద్ధితో రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను వేగంగా రవాణా చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో రైస్‌మిల్లులు అధికంగా ఉన్నందున గోదాముల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
బైపాస్ పనులు ఏడాదిలోపు పూర్తి
ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలో గత రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సుమారు రూ.180 కోట్ల విలువైన హెచ్‌ఏఎం రహదారి పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు.
పెద్దపల్లి బైపాస్ రహదారికి రూ.82 కోట్లు మంజూరు చేయించామని, భూసేకరణకు అవసరమైన మరో రూ.27 కోట్లను త్వరలో విడుదల చేయిస్తామని తెలిపారు. ఏడాదిలోపు బైపాస్ రహదారిని పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుల్తానాబాద్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున బైపాస్ రహదారి అత్యవసరమని, దాని నిర్మాణానికి మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
జూలపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రాల్లో నాలుగు లేన్ల రహదారులు, సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు పలు గ్రామాల్లో రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌పామ్‌పై దృష్టి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్, స్ప్రింక్లర్, రుణమాఫీ తదితర కార్యక్రమాలకు నిధులు వెచ్చిస్తోందని తెలిపారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గానికి మరిన్ని హెచ్‌ఏఎం రహదారులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కోరారు.
హైదరాబాద్–రామగుండం రహదారిని విస్తరించడంతో పాటు అవసరమైతే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, గోదావరిఖని డిప్యూటీ మేయర్ పారుపల్లి ఎల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
