యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు…
ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వ్యాఖ్య…
__ఎంపీ గడ్డం వంశీకృష్ణ…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన బీఆర్ఎస్ నాయకత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.
విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయిందని విమర్శించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక రంగాల్లో యువతకు శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శిక్షణా కేంద్రాల ద్వారా ప్రతి సంవత్సరం వేలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని తెలిపారు.
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టకుండా వారిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని ఆరోపించారు. యువత ఆకాంక్షలను నెరవేర్చకుండా వారిని తప్పుదారి పట్టించడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప బీఆర్ఎస్ నాయకత్వం చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలనతో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. యువత రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ అభివృద్ధి, యువత సంక్షేమం, ఉపాధి కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
