తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా..!
తెలంగాణలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే ఉంది
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది.
గత ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడం, పైగా అధికారంలోకి ఉండటంతో ఈ సీటును తిరిగి నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈ సారిఎమ్మెల్సీగా పోటీ చేయబోనని సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలపగా అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు బరిలో నిలిచిన వెలిచాల రాజేందర్ రావు టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ, బీఆర్ఎస్ సైతం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తుండగా పోటీ త్రిముఖంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిస్తే ఈ జిల్లాల నుంచే ఏడుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అలాగే ఈ జిల్లాల పరిధిలోని కరీంనగర్, మెదక్, నిజమాబాద్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ పార్టీ గెల్చుకోగా, పెద్దపల్లి స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో అందరి దృష్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికపైనే ఉంది.
మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండగా బీఆర్ఎస్‌కు గట్టి పట్టున్న ఈ జిల్లాలో గెలిచి సత్తాచాటాలని భావిస్తున్నారు గులాబీ బాస్. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కి కూడా ఈ ఎన్నికలు సవాల్‌గా మారిపోయాయి. ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.