పకడ్బందీగా ఓటర్ జాబితా రూపకల్పన ….
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత:
ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించే దిశగా ఓటరు జాబితా సవరణ-2025 ప్రక్రియను చేపట్టడం జరిగిందని, ఎలక్టోరల్ రోల్/ఎపిక్ లో వ్యత్యాసాల తొలగింపు, చేర్పులు, మార్పులతో పాటు, జాబితాలో ఓటర్ ల ఫోటోలు స్పష్టంగా ఉండే విధంగా, బోగస్ కార్డుల ఏరివేత, మృతుల పేర్లు తొలగించి పకడ్బందీగా తుది జాబితా రూపొందించుటకు సహకరించాలని అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అన్నారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్.ఎస్.ఆర్. -2025, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, ఎలక్టోరల్ రోల్/ఎపిక్ లో వ్యత్యాసాల తొలగింపుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ తర్వాత జిల్లాలో మొత్తం 5 నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఖమ్మం జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ నియోజక వర్గాలు, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం 1500 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నారు.
పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ తర్వాత ఖమ్మం, మధిర, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎటువంటి మార్పులు లేవని, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండు, సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలో 3 పోలింగ్ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేశామని, అట్టి వివరాలను రాజకీయ పార్టీలకు తెలియజేసామని అన్నారు. పకడ్బందీగా ఓటర్ జాబితా రూపకల్పనపై రాజకీయ పార్టీల ప్రతినిధులు దృష్టి సారించాలని, అక్టోబర్ 29న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలను, ఓటర్ నమోదు దరఖాస్తులను నవంబర్ 28 వరకు స్వీకరిస్తామని, డిసెంబర్ 24 వరకు అభ్యంతరాలను పరిష్కరించి, 2025 జనవరి 6న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఓటర్ నమోదు, చేర్పులు, మార్పులపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు నవంబర్ 9, 10వ తేదీలలో ప్రత్యేక క్యాంపెయిన్ జరుగుతుందని, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ స్థాయి అధికారి ఓటర్ జాబితాతో అందుబాటులో ఉంటారని, ప్రతి ఒక్కరు తమ ఓటును చెక్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్, భాజాపా పార్టీ ప్రతినిధి వి.రాజేష్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ. గోపాల్, భారాస పార్టీ ప్రతినిధులు కే. ఫ్రాన్సీస్, సి.పి.ఐ(ఎం) పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఎలెక్షన్ విభాగ డి.టి. అన్సారి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.