డాక్టర్ కర్రి రామారెడ్డికి అరసం ఘన సత్కారం
-పడాల వీరభద్రరావు రచించిన ‘అల్లూరి వాస్తవ చరిత్ర’ గ్రంథం విడుదల
రాజమహేంద్రవరం, సాక్షిత :
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు, నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి అమ్ముల పొదిలో మరో పాశుపతాస్త్రం చేరి, 38వ డిగ్రీ పొందిన సందర్భంగా అరసం తూ.గో.జిల్లా శాఖ ఘనంగా సత్కరించింది. మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్ లోని మానస హాస్పిటల్ లో జరిగిన అరసం తూ.గో.జిల్లా శాఖ అధ్యక్షులు పడాల వీరభద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు మాట్లాడుతూ డాక్టర్ కరి రామారెడ్డి నిత్య విద్యార్థిగా 38 డిగ్రీలు, రాష్ట్రపతిచే అవార్డు పొంది రాజమహేంద్రవరానికే కాకుండా దేశానికే గర్వకారణంగా నిలిచారని అన్నారు. ఆయన తూ.గో.జిల్లా అరసం గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించడం గర్వకారణం అన్నారు.
అలాగే ఈ సంవత్సరం జనవరిలో పడాల రామారావు జీవితం-సాహిత్యం, ఇప్పుడు ఆగస్టు 15న 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు వాస్తవ చరిత్ర గ్రంథాల ముద్రణకు డాక్టర్ రామారెడ్డి సహాయ సహకారాలు అందించారని, ఈ రెండు గ్రంథాలు అరసం తూ.గో.జిల్లా ప్రచురించడం జరిగిందని పడాల వీరభద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు రచించిన అల్లూరి సీతారామరాజు వాస్తవ చరిత్ర గ్రంథాన్ని డాక్టర్ కర్రి రామారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కర్రి రామారెడ్డిని అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్. పృథ్వి పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే అల్లూరి వాస్తవ చరిత్ర గ్రంథ ముద్రణకు సహకరించిన దాత అరసం జిల్లా కార్యవర్గ సభ్యుడు సేవారత్న లోలభట్టు శ్రీనివాసరాజును అరసం జిల్లా కార్యదర్శి బిహెచ్వి రమాదేవి, ఉపాధ్యక్షుడు పివిబి సంజీవరావులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు డాక్టర్ కర్రి రామారెడ్డికి, లోలభట్టు శ్రీనివాసరాజులకు అల్లూరి వాస్తవ చరిత్ర పుస్తకాలను అందజేశారు. అరసం కార్యవర్గ సభ్యులందరికీ పుస్తకాలను బహుకరించడం జరిగింది. తొలుత అరసం జిల్లా కార్యవర్గ సభ్యుడు బూడిద వీర్రాజు స్వాగతం పలుకుతూ డాక్టర్ కర్రి రామారెడ్డికి పుష్పగుచ్చాన్ని అందజేశారు. రచయిత మల్లెమొగ్గల గోపాలరావు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.