ఎం. అగ్రహారం గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ
రైతుల భూ హక్కులకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోంది – హరీష్ బాబు
రైతు భూ హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం – హరీష్ బాబు
రైతు సంక్షేమం–గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం – హరీష్ బాబు
మాటలతో కాదు… అభివృద్ధి పనులతో ప్రజల విశ్వాసాన్ని నిలబెడుతున్నాం – హరీష్ బాబు
ప్రతి గ్రామంలో అభివృద్ధి… ప్రతి రైతు కుటుంబంలో ఆనందం మా ప్రభుత్వ లక్ష్యం – హరీష్ బాబు
తాడిమర్రి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి సత్యకుమార్ – హరీష్ బాబు
అభివృద్ధి, సంక్షేమం… ధర్మవరం నియోజకవర్గానికి రెండు కళ్లలా పనిచేస్తున్నాం – హరీష్ బాబు
తాడిమర్రి మండలం, ఆగస్టు 04:– శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం ఎం. అగ్రహారం గ్రామంలో మంగళవారం పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, ధర్మవరం ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులతో కలిసి పాల్గొన్నారు. ఎం. అగ్రహారం రెవెన్యూ పరిధికి సంబంధించిన మొత్తం 1,630 పట్టాదార్ పాస్ పుస్తకాలలో తొలి విడతగా సుమారు 200 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమ భూ హక్కులను అధికారికంగా గుర్తించి పాస్ పుస్తకాలు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందన్నారు. రైతుల భూములకు సంబంధించిన హక్కులను పరిరక్షించడం, భూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడం, ప్రతి అర్హ రైతుకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం రైతుకు అత్యంత విలువైన పత్రం అని, భూమి యాజమాన్యానికి చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పంట రుణాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మిగిలిన అర్హులైన రైతులకు కూడా త్వరితగతిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో ధర్మవరం నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా చర్యలు చేపడుతున్నామని హరీష్ బాబు పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని పేర్కొన్న హరీష్ బాబు, ముఖ్యంగా తాడిమర్రి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా అమలవుతున్నాయని వివరించారు.
తాడిమర్రి మండలంలోని పుల్లఓబయ్యపల్లి–పిన్నదరి–పీఎన్ పల్లి మీదుగా తాడిమర్రి పుల్లంపల్లి వరకు 8.8 కిలోమీటర్ల బీటీ రహదారి పునర్నిర్మాణ పనులు రూ.3 కోట్లతో కొనసాగుతున్నాయని, అలాగే ధర్మవరం–తాడిపత్రి ప్రధాన రహదారి నుంచి నర్పింపల్లి మీదుగా నిడిగల్లు వరకు 6.1 కిలోమీటర్ల బీటీ రహదారి పనులు రూ.2 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా నిడిగల్లు నుంచి శివంపల్లి రీచ్-1, 2, 3, 4 వరకు 3 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణానికి రూ.1.75 కోట్లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా తాడిమర్రి మండలంలోని 133 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.1.62 కోట్ల ఆర్థిక సాయం అందించామని, అలాగే ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 988 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.10.14 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం అందించడం జరిగిందని హరీష్ బాబు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తాడిమర్రి మండలంలోని పిన్నదరి, శివంపల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామానికి రూ.2.60 లక్షల వ్యయంతో ఆర్వో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పశుసంవర్ధక రంగానికీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొంటూ, ధర్మవరం నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరుకున్న నాలుగు పశువైద్య ఆసుపత్రుల భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా వాటికి మంజూరు లభించిందని తెలిపారు.
ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతోందని హరీష్ బాబు అన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవల కింద రూ.7 వేల కోట్లు ఖర్చు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని వివరించారు.
రైతు సంక్షేమం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాల అమలులో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని హరీష్ బాబు పేర్కొన్నారు. ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి, ఎమ్మార్వో రెడ్డి లక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ భాస్కర్ రెడ్డి, వీఆర్వో రామాంజి, బిజెపి మండల అధ్యక్షులు దేవర రాము, వన్నూరు రెడ్డి, ఆర్వేటి ఆనంద్, లక్ష్మీనారాయణ, నాగార్జున, తదితర ఎన్డీఏ కూటమి నాయకులు, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


