SAKSHITHA NEWS

యూనియన్ బ్యాంక్ ఖాతదారుల ఇబ్బందులను గుర్తించి,పరిష్కరించండి…

పార్కింగ్ సదుపాయం లేక రోడ్డుపైనే వాహనాల పార్కింగ్*

బ్యాంక్ లోపల సరిపడ స్థలం లేక,బయట గంటల తరబడి ఖాతాదారుల నిరీక్షణ

యూనియన్ బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు

సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో గల యూనియన్ బ్యాంకు కు సరైన పార్కింగ్ సదుపాయం లేక అలాగే బ్యాంకు లోపల ఖాతాదారులు వేచి ఉండడానికి సరిపడా స్థలం లేక బ్యాంకు బయట గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొందని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్
శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ గండేటి రాజేష్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన శంకర్‌పల్లి మండల, మున్సిపల్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులతో కలిసి బ్యాంకు మేనేజర్ సురేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాజేష్ గౌడ్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు కు వచ్చే ఖాతాదారులు తమ వాహనాలు ఎక్కడ నిలుపుకోవాలో తెలియక, బ్యాంకు ముందుగల మెయిన్ రోడ్డు పైనే తమ తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, సరిగ్గా బ్యాంకు ముందే యూటర్న్ ఉండడంతో, యూటర్న్ చేసుకునే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బ్యాంకు పక్కనే పెట్రోల్ బంక్ ఉండడం ఆ పెట్రోల్ బంక్ కు వెళ్లే వాహనాలు ఈ యూటర్న్ గుండనే వస్తూ పోతుండడంతో ట్రాఫిక్ ఏర్పడడంతో పాటు, కొన్ని పర్యాయాలు ప్రమాదాలు సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయని రాజేష్ గౌడ్ తెలిపారు. ఈ విషయంపై ఎన్ని మార్లు పత్రికల్లో వార్త ప్రచురించినప్పటికీ, యూనియన్ బ్యాంక్ అధికారుల్లో మాత్రం చలనం లేకపోవడం బాధాకరం అని ఆయన వాపోయారు. అలాగే బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు బ్యాంకు లోపల వారు నిరీక్షించడానికి తగినంత స్థలం లేక, బ్యాంకు బయట గంటల తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి ఉందని, ఖాతాదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవలసిన యూనియన్ బ్యాంకు అధికారులు, వారి ఇబ్బందులను గుర్తించి, సమస్య పరిష్కారం దిశగా ఇప్పటికైనా కృషి చేయాలని ఆయన హితవు పలికారు. వినతి పత్రం అందుకున్న బ్యాంకు మేనేజర్ సురేష్ రెడ్డి వివరణ ఇస్తూ పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో మండల చైర్మన్ పరమేష్, కౌన్సిల్ సభ్యులు బి రవి, రాజేశ్వర్ గౌడ్, శ్రీకాంత్ ఉన్నారు.


SAKSHITHA NEWS