అభివృద్ధి అంటే తెలుగుదేశం … తెలుగుదేశమంటే అభివృద్ధి – మాజీ మంత్రి ప్రత్తిపాటి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు – ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు
బొప్పుడి గ్రామ అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో ఎంపీ లావు, ఎంఎల్ఏ ప్రత్తిపాటి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గంలోని గ్రామాల రూపురేఖలు మార్చివేస్తామని, రోడ్లు.. డ్రైనేజ్ లు.. కమ్యూనిటీ భవనాలు… తాగునీటి సౌకర్యంతో పాటు అన్నిరకాల వసతులతో రాష్ట్రంలోని గ్రామాలన్నీ కళకళలాడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం ఆయన నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలుతో కలిసి నియోజకవర్గంలోని బొప్పూడి గ్రామంలో 35.23 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సీసీ.రోడ్లు, డ్రైనేజ్ లు, అంగన్ వాడీ భవనం ప్రారంభించిన అనంతరం మాజీమంత్రి ప్రత్తిపాటి, ఎంపీ కృష్ణదేవరాయలు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ…. అభివృద్ధికి మారుపేరు ముఖ్యమంత్రి చంద్రబాబని, తెలుగుదేశమంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే తెలుగుదేశమనే వాస్తవాన్ని ప్రజలు అంగీకరించాలన్నారు.
బొప్పూడి గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని, ప్రధానిమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువనేత, మంత్రి లోకేశ్ సహా ఎందరో ప్రముఖులు ఈ గ్రామానికి విచ్చేసి ఇక్కడి అభివృద్ధిని చూశారన్నారు. గ్రామానికి సాగునీటి లిఫ్ట్ అందించామని, బైపాస్ రహదారి అందుబాటులోకి తీసుకొచ్చామని, గ్రామాభివృద్ధికోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకుసాగాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో పనిచేసేవారిని కాదని, ఎక్కడినుంచో వచ్చినవారిని గెలిపించారని, దాని ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నామన్నారు. అంతా సక్రమంగా జరిగితే ప్రధాని మోదీ చేతులమీదుగా చిలకలూరిపేట బైపాస్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. బైపాస్ నిర్మాణానికి భూములిచ్చిన ప్రతి రైతుకి న్యాయం చేసే తీరుతామని, తాను.. ఎంపీ ఇద్దరం రైతుల పక్షమేనని పుల్లారావు స్పష్టం చేశారు. అరక దున్ని వ్యవసాయం చేసిన నాకంటే రైతుల బాధలు ఎవరికీ గొప్పగా తెలియవన్నారు. బైపాస్ రహదారుల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే కేంద్రప్రభుత్వం కొత్త విధివిధానాలు ఖరారు చేయనుందని, అవి రహదారుల నిర్మాణానికి భూములిచ్చే రైతులకు న్యాయం చేసేవిగానే ఉంటాయన్నారు. తాను గానీ, ఎంపీ గానీ గత పాలకుల్లా ఓట్లు వేయించుకొని ఇంట్లో పడుకునే వాళ్లం కాదని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు, బొప్పూడి గ్రామాభివృద్ధికి చేయాల్సిందంతా చేస్తామన్నారు. బొప్పూడి ఆంజనేయస్వామి గుడి కంటే మిన్నగా కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి గుడిని అభివృద్ధి చేస్తామని, అవసరమైతే టీటీడీని సంప్రదించి నిధులు సమకూరుస్తామని పుల్లారావు చెప్పారు. అమృతధార, జల్ జీవన్ మిషన్ పథకాల్లో భాగంగా బొప్పూడిలో ప్రతిఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందించే ప్రాజెక్ట్ ను కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే తమను అభివృద్ధి చేయమని వారు అడగడం సబబేనని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత పాలకుల అవినీతి వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని నరసరావు పేట ఎంపీ కృష్ణ దేవరాయలు తెలిపారు. బొప్పూడి గ్రామంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ.1200కోట్లు మంజూరు చేసినట్టు ఎంపీ తెలిపారు. సాగర్ నుంచి నీరు నేరుగా బొప్పూడి గ్రామంలోని వాటర్ హెడ్ ట్యాంక్ కు వచ్చేలా ఏర్పాటుచేస్తామన్నారు. గ్రామస్తులు అడిగిన కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై కూడా దృష్టి పెడతామని ఎంపీ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన తాగునీరు లేకపోవడం నిజంగా బాధాకరమన్నారు. చంద్రబాబునాయుడు గారి ఆధ్వర్యంలో నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామానికి అవసరమైన కనీస సౌకర్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని కృష్ణ దేవరాయలు స్పష్టంచేశారు.