పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం సహించేది లేదు…

Sakshitha news

పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం సహించేది లేదు…

ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి….

— సీపీ అంబర్ కిషోర్ ఝా…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సీసీటీఎన్‌ఎస్‌ 2.0 ద్వారా కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తులో జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

సీసీటీఎన్‌ఎస్‌ 2.0లో ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. నిందితుల అరెస్టుల్లో ఎలాంటి జాప్యం చేయరాదని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, ఎన్‌డీపీఎస్ కేసులు, నేరాల పెరుగుదలకు సంబంధించిన కేసులు, కీలక నివేదికల పెండింగ్ అంశాలను డీసీపీలు, ఏసీపీలు క్రమం తప్పకుండా సమీక్షించాలని తెలిపారు. పెండింగ్ ఈ-సమన్లను కూడా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి
ఆస్తి సంబంధిత కేసులు, చిట్‌ఫండ్, ఆర్థిక నేరాలు, సీఎంఆర్ బియ్యం అక్రమ మళ్లింపు కేసుల్లో దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, ఆస్తుల గుర్తింపు, స్వాధీనం, జప్తు తదితర అంశాలను సీపీ సమీక్షించారు. ఆర్థిక నేరాల్లో నిబంధనల ప్రకారం ఆస్తుల జప్తు ప్రక్రియను తప్పనిసరిగా చేపట్టాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.

సైబర్ నేరాల దర్యాప్తు వేగవంతం చేయాలి
కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతి పోలీస్ అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తుకు అవసరమైన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, సమాచార సాంకేతికతకు సంబంధించిన కేసులను నిర్దేశిత ప్రామాణిక విధానాల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని తెలిపారు.

అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం
గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పేకాట, ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం అక్రమ తరలింపు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు. నేర నియంత్రణతో పాటు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండటం తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని సీపీ తెలిపారు. నేరం జరిగిన వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వారికి పోలీసులపై నమ్మకం, భరోసా కలిగేలా వ్యవహరించాలని సూచించారు.

పోలీసుల ప్రవర్తనే శాఖ ప్రతిష్ఠను నిర్ణయిస్తుంది అని సీపీ స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్.శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్‌తో పాటు ఇతర సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Scroll to Top