శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో సీపీ ఆకస్మిక తనిఖీ
పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి….
కనిపించేలా పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించం….
–సీపీ అంబర్ కిశోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, శ్రీరాంపూర్, : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాల జోన్ పరిధిలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, సిబ్బంది విధులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్ ముందుగా పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వివిధ నేరాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమపద్ధతిలో భద్రపరచాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్‌లో 5ఎస్ విధానాన్ని అమలు చేసి, అన్ని రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
స్టేషన్ రికార్డులను పరిశీలించిన సీపీ.. దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలు, వాటి ప్రస్తుత స్థితి, నిందితుల అరెస్టులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, పెండింగ్‌కు గల కారణాలను ఇన్‌స్పెక్టర్ అశోక్, ఎస్‌ఐ సంతోష్‌లను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఆన్‌లైన్ రికార్డుల నిర్వహణపై సమీక్ష
ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో కమిషనర్ మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియను సమీక్షించారు. విధుల్లో ఉన్న బ్లూకోట్స్ సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి వారి ప్రస్తుత స్థానాలు, నిర్వహిస్తున్న విధుల వివరాలను తెలుసుకున్నారు.
కోర్టు విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సీపీ.. వారి విధులు, ఆ రోజు కోర్టులో విచారణకు ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ.. కనిపించేలా పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ తనిఖీలో శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ పాల్గొన్నారు.


